LOADING...
Trump-Modi: భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!
భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

Trump-Modi: భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పదే పదే మీడియా ముందుకు వచ్చి, తాను అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది మొత్తం ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం చేసిన ట్రంప్, ఈ ఏడాది మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గ్రీన్‌లాండ్, కొలంబియా, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే తరహాలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై కూడా ట్రంప్ గురి పెట్టినట్టు తెలుస్తోంది. ఆయనకు "ఖబడ్దార్" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

వివరాలు 

భారత్‌, చైనా దేశాలను శిక్షించేందుకు రూపొందించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

ఇవన్నీ ఒకెత్తు అయితే, తాజాగా భారత్‌, చైనాలపై కూడా ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఇప్పటికే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ భారత్‌, చైనా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలను శిక్షించేందుకు రూపొందించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఉత్పాదక సమావేశం తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఆంక్షల బిల్లును ఆమోదించారని, వచ్చే వారం ప్రారంభంలోనే దీనిపై ఓటింగ్ జరగవచ్చని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియాలో వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిండ్సే గ్రాహం చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

భారతదేశంపై ఏకంగా 500 శాతం వరకు సుంకాలు

రష్యా నుంచి ఉద్దేశపూర్వకంగా చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వైపాక్షిక ఆంక్షలు విధించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఒకవేళ వచ్చే వారం ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్‌, చైనా,బ్రెజిల్ దేశాలపై భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంపై ఏకంగా 500 శాతం వరకు సుంకాలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా 50 శాతం సుంకం విధించడంతో భారత్-అమెరికా సంబంధాలు కొంత మేరకు దెబ్బతిన్నాయి. ఇప్పుడు 500 శాతం సుంకం అమలు చేస్తే మాత్రం రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదాస్పద బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం,డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ కలిసి స్పాన్సర్‌గా రూపొందించారు.

Advertisement

వివరాలు 

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు 

దీనికి తాజాగా ట్రంప్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వచ్చే వారమే సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. ఒకవేళ బిల్లు పాస్ అయితే భారత్‌, చైనా, బ్రెజిల్‌పై భారీ స్థాయిలో సుంకాల భారం పడనుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇటీవల శాంతి చర్చలు ఫలించినట్టే కనిపించి, మళ్లీ పరిస్థితి స్తబ్దంగా మారింది. ఇదిలా ఉండగా భారత్‌, చైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు.

వివరాలు 

 భారత్ స్పందన ఆసక్తికరం 

తక్షణమే రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని భారత్‌కు సూచించినా, ట్రంప్ హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మాట వినని దేశాలకు గట్టి శిక్ష విధించేందుకే ఈ కొత్త బిల్లును తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement