'We Spy Better': 'వారికంటే మేమే బెటర్'.. చైనా,రష్యా గూఢచర్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
చైనా, రష్యాపై అమెరికా కూడా గూఢచర్యం చేస్తోందని,ఈ విషయంలో తమదే పైచేయి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దేశాలు అమెరికాపై నిఘా పెట్టినట్లే తాము కూడా వాటి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. చైనా రష్యా కంటే మెరుగ్గా గూఢచర్యం చేయగలమని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి సభల్లో పాల్గొన్నఆయన..ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్నారు. ద్రవ్యోల్బణం,చమురు ధరలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాపై చైనా,రష్యా గూఢచర్యం చేస్తున్నాయన్న ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. ఆదివారం అయోవాలోని డుబుక్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. చైనా,రష్యా అమెరికాపై నిఘా పెడుతున్న విషయం తనకు తెలుసని చెప్పారు. అయితే,తాము కూడా ఆ దేశాలపై నిఘా ఉంచుతున్నామని,ఈవిషయంలో అమెరికాదే పైచేయి అని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని వెల్లడి
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని ట్రంప్ పేర్కొన్నారు.
ఆ దేశానికి రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు లేకుండా చేశామని, నాయకత్వాన్ని కూడా దెబ్బతీశామని అన్నారు.
చర్చలు జరిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని, దాన్ని ముగింపు దశకు తీసుకొస్తున్నామని చెప్పారు.
కాన్సస్‌లోని సలీనాలో జరిగిన మరో ప్రచార సభలో ట్రంప్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు.
గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 1.7 శాతానికి తగ్గిందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అధిక ధరల సమస్యను వారసత్వంగా పొందానని, దానికి తాను కారణం కాదని అన్నారు.
వివరాలు
యుద్ధం ముగిశాక చమురు ధరలు భారీగా తగ్గుతాయని అంచనా
ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు.
బరాక్ ఒబామా, జో బైడెన్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కంటే ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు మరింత భారీగా తగ్గుతాయని అంచనా వేశారు.
దేశ భద్రత, ప్రపంచ శాంతి కోసం ఇంధన ధరలు పెరగడం చిన్న మూల్యమేనని వ్యాఖ్యానించారు.
అమెరికాలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్‌లపై ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ డుబుక్‌లో రెండు గంటలకు పైగా ప్రసంగించారు. అనంతరం సలీనాకు వెళ్లి చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.