LOADING...
USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్
ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఐరోపా సమాఖ్యల మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఈయూ FTA)పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం తమను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో ఇంకా యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లోనూ.. ఈయూ మానవతా అంశాలను పక్కనబెట్టి వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

వివరాలు 

వాణిజ్య లాభాలకే ఈయూ అధిక ప్రాధాన్యం

ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ బెసెంట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. "వాళ్లకు ఏది మంచిదనిపిస్తే అది చేయొచ్చు. కానీ యూరోపియన్‌ దేశాల వైఖరి మాత్రం నన్ను చాలా నిరాశపరిచింది" అని అన్నారు. గతేడాది భారత్‌ నుంచి జరిగే దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమలాగే భారత్‌పై అదనపు సుంకాలు విధించేందుకు ఈయూ ముందుకు రాలేదని తెలిపారు. దానికి కారణం తమ స్వంత వాణిజ్య ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయూ ఆ నిర్ణయం తీసుకుందని బెసెంట్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ ప్రజల బాధలకన్నా కూడా వాణిజ్య లాభాలకే ఈయూ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు.

వివరాలు 

రష్యా సాగిస్తున్న యుద్ధానికి యూరోప్‌ దేశాలు పరోక్షంగా ఆర్థిక సహకారం

ఇదే సందర్భంలో రష్యా చమురు వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రష్యా నుంచి భారత్‌కు చమురు సరఫరా అవుతుందని, దాన్ని భారత్‌లో శుద్ధి చేసి చమురు ఉత్పత్తులుగా తయారు చేస్తున్నారని తెలిపారు. ఆ ఉత్పత్తులను ఇప్పుడు యూరోపియన్‌ దేశాలే కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా రష్యా సాగిస్తున్న యుద్ధానికి యూరోప్‌ దేశాలు పరోక్షంగా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లేనని బెసెంట్‌ ఆరోపించారు. ఈ ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందంపై స్కాట్‌ బెసెంట్‌ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement