LOADING...
Iran: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 538కి చేరిన మృతులు
ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 538కి చేరిన మృతులు

Iran: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 538కి చేరిన మృతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఆందోళనకారులను అణిచివేయడానికి భద్రతా దళాలు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఇరాన్‌ వీధులు రక్తపాతానికి వేదికలుగా మారాయి. ఆదివారం నాటికి ఘర్షణల్లో మృతుల సంఖ్య 538కు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల్లో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇదే సమయంలో సైన్యం దాదాపు 10,670 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

వివరాలు 

యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు

మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యకు వెళ్లే అవకాశాలను అమెరికా గంభీరంగా పరిశీలిస్తున్నదన్న కథనాలు పశ్చిమాసియా అంతటా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలను బలపరుస్తున్నాయి. ఈ అంశంపై ఇరాన్‌, అమెరికా మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఆందోళనకారులకు ఏదైనా హాని జరిగితే అమెరికా జోక్యం చేసుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన సైనిక చర్యల దిశగా ముందడుగులు వేస్తున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

వివరాలు 

 మృతుల సంఖ్య మరింత పెరిగితే.. 

ఈ విషయమై ఇప్పటికే అమెరికా సైనికాధికారులు ట్రంప్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరాన్‌పై ఎలా స్పందించాలన్న దానిపై వివిధ ప్రతిపాదనలు ఆయన ముందున్నాయని అధికారులు వెల్లడించారు. ఇందులో అమెరికా నేరుగా రంగంలోకి దిగకుండా పరోక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ట్రంప్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. కానీ మృతుల సంఖ్య మరింత పెరిగితే ఆయన కఠిన చర్యలకు వెనుకాడరని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

దేశాన్ని అస్థిరపర్చేందుకు ఇజ్రాయెల్‌, అమెరికా కలిసి కుట్ర

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలను ఉగ్రవాద చర్యలతో పోల్చుతూ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లరి మూకలు దేశాన్ని, సమాజాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశాన్ని అస్థిరపర్చేందుకు ఇజ్రాయెల్‌, అమెరికా కలిసి కుట్ర చేస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతేనని, కానీ ముందుగా సమాజాన్ని అల్లర్ల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

వివరాలు 

'అమెరికాకు మరణం' అంటూ నినాదాలు

ఇరాన్‌ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని, వారికి తాము అండగా ఉంటామని డొనాల్డ్‌ ట్రంప్‌ తన స్వంత సామాజిక మాధ్యమం 'ట్రూత్‌ సోషల్‌'లో పేర్కొన్నారు. దీనికితోడు అమెరికా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ట్రంప్‌తో ఆటలాడొద్దని, ఆయన హెచ్చరికలు మాటలకే పరిమితం కావని ఇరాన్‌ను హెచ్చరించింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ పార్లమెంటులో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. సభ్యులు 'అమెరికాకు మరణం' అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాకర్‌ గాలిబాఫ్‌ అమెరికాపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని, పశ్చిమాసియాలో ఉన్నఅమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

లండన్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎదుట నిరసనలు

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఇరాన్‌లోని ప్రజా నిరసనలు,సిరియా, గాజాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ధైర్యంగా పోరాడుతున్న ఇరాన్‌ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని రూబియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్‌లోని ఆందోళనల ప్రభావం దేశ సరిహద్దులు దాటి విదేశాలకూ విస్తరించింది. లండన్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎదుట నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ జెండాను తొలగించి,దాని స్థానంలో 1979 నాటి పాత ఇరాన్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే పారిస్‌,బెర్లిన్‌ సహా యూరప్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఇరాన్‌ ప్రజలకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించారు.

Advertisement