Trump-Xi Summit: తైవాన్ విషయంలో అమెరికాకు జిన్‌పింగ్ ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తైవాన్ అంశంపై జిన్‌పింగ్ అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక చేసినట్లు చైనా అధికారిక మాధ్యమాలు వెల్లడించాయి. అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత సున్నితమైనదని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈ సమస్యను సరైన విధంగా పరిష్కరించకపోతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం అమెరికా-చైనా సంబంధాలకు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచానికి మేలు
ప్రపంచ దేశాలన్నీ తమ సమావేశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయని జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా పరస్పర భాగస్వామ్య దేశాలుగా ముందుకు సాగాలని, ప్రత్యర్థులుగా మారకూడదని సూచించారు. రెండు దేశాలు ఒకదానికొకటి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచానికి కూడా మేలు చేస్తాయని చెప్పారు. తమ మధ్య భేదాభిప్రాయాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని తాను విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై ట్రంప్‌తో చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
జిన్‌పింగ్ గొప్ప నాయకుడు
ఇక ట్రంప్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌తో జరిగిన ఈ భేటీని అత్యంత కీలక శిఖరాగ్ర సమావేశంగా అభివర్ణించారు. చైనా అధ్యక్షుడితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా ప్రస్తావించారు. జిన్‌పింగ్ గొప్ప నాయకుడని ప్రశంసించారు. తాను అలా చెప్పడం కొందరికి నచ్చకపోయినా.. అది నిజమేనని వ్యాఖ్యానించారు. మీ స్నేహితుడిగా ఉండటం తనకు గర్వకారణమని జిన్‌పింగ్‌తో ట్రంప్ అన్నారు. ఈ పర్యటనతో అమెరికా-చైనా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.