LOADING...
Trump: హెచ్‌1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు
హెచ్‌1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

Trump: హెచ్‌1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించిన ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పులు దేశానికి నష్టం కలిగిస్తున్నాయని, కొందరు జడ్జీలు తమ అధికారాలను అతిగా వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు, కోర్టు తీర్పును పలువురు అమెరికా చట్టసభ సభ్యులు, భారతీయ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. గత సెప్టెంబరులో ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. అయితే ఈ నిర్ణయం చట్టబద్ధం కాదని బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు జడ్జి సొరొకిన్‌ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు తర్వాత అమెరికాలో రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది.

వివరాలు 

దేశానికే నష్టం చేస్తున్నారు

ఈ అంశంపై మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో స్పందించిన ట్రంప్‌.. ''ఈ జడ్జీలు మాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వారు అతిగా వ్యవహరిస్తూ దేశానికే నష్టం చేస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బోస్టన్‌ కోర్టు తీర్పును అప్పీలేట్‌ కోర్టులో సవాలు చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. హెచ్‌1బీ కార్యక్రమం ఎన్నో దశాబ్దాలుగా దుర్వినియోగానికి గురవుతోందని, దానిలో సంస్కరణలు తీసుకురావడానికే ట్రంప్‌ చర్యలు చేపట్టారని శ్వేతసౌధ అధికార ప్రతినిధి టేలర్‌ రోజర్స్‌ తెలిపారు. ఇదే తరహా నిర్ణయాలను వాషింగ్టన్‌లోని మరో ఫెడరల్‌ జడ్జి సమర్థించారని, ఈ కేసులోనూ తమకు అనుకూల తీర్పు వస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.

వివరాలు 

హెచ్‌1బీ వీసా ఫీజును చట్టవిరుద్ధంగా ప్రకటించడం సానుకూల పరిణామం 

అయితే బోస్టన్‌ కోర్టు తీర్పును పలువురు అమెరికా చట్టసభ సభ్యులు స్వాగతించారు. వారిలో అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నేతలు కూడా ఉండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని,హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన ఈ తీర్పు అలాంటి ప్రాంతాలకు ఉపయోగపడుతుందని రిపబ్లికన్‌ సెనేటర్‌ లీసా ముర్కోవ్‌స్కీ అభిప్రాయపడ్డారు. భారతీయ సంఘాలు కూడా కోర్టు నిర్ణయాన్ని స్వాగతించాయి.హెచ్‌1బీ వీసా ఫీజును చట్టవిరుద్ధంగా ప్రకటించడం సానుకూల పరిణామమని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ చీఫ్‌ ఖండేరావ్‌ కంద్‌ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందా లేదా అనే అంశంపై ఇంకా సందేహాలు ఉన్నాయని ఇండియన్‌ డయాస్పొరా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ జోషిపురా అభిప్రాయపడ్డారు.

Advertisement