UK Elections 2024: నేడే బ్రిటన్‌లో పోలింగ్.. రిషి సునక్ మళ్లీ గెలుస్తాడా?
UK Elections 2024: బ్రిటన్ పార్లమెంట్ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈసారి బ్రిటన్‌లో కన్జర్వేటివ్, లేబర్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా. భారత సంతతికి చెందిన ప్రస్తుత ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్(Rishi Sunak) గెలుపు ఈ సారి అంత సులువు కాదని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. పోలింగ్‌కు ముందు నిర్వహించిన అన్ని ఎన్నికల సర్వేలలో లేబర్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ కంటే ఆధిక్యాన్ని పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఈసారి లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్‌తో సునక్ ప్రత్యక్ష పోటీలో ఉన్నారు. స్టార్మర్ ఏప్రిల్ 2020లో లేబర్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
భారత ఓటర్లు కీలకం
బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికలలో భారతీయ సంతతికి చెందిన ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే పాలక కన్జర్వేటివ్ పార్టీ భారతీయ సంతతికి చెందిన 30మందిని పోటీలో నిలిపింది. మరోవైపు, లేబర్ పార్టీ భారతీయ సంతతికి చెందిన 33 మందిని అభ్యర్థులుగా ప్రకటించింది. యుకెలో గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి, జూలై 5 ఉదయం ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి బ్రిటన్‌లో ఎన్నికలు జనవరి 2025లో జరగాల్సి ఉంది. వాస్తవానికి కన్జర్వేటివ్ ప్రభుత్వ పదవీకాలం 17 డిసెంబర్ 2024తో ముగుస్తుంది. అయితే సునక్ ముందే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలను ప్రకటించారు.
బ్యాలెట్ బాక్స్‌లో ఓటింగ్
బ్రిటన్‌లో లోక్‌సభను హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. రాజ్యసభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. భారతదేశంలోని లోక్‌సభ మాదిరిగానే, బ్రిటన్‌లో కూడా హౌస్ ఆఫ్ కామన్స్ కోసం ప్రతి ఐదేళ్లకు ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 326 సీట్లను సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు బ్రిటన్ రాజు లేదా రాణి ఆహ్వానిస్తారు. బ్రిటన్‌లో భారతదేశంలో మాదిరిగా ఈవీఎంలను ఉపయోగించరు. ఈవీఎంలకు బదులుగా ఓటింగ్ బ్యాలెట్ బాక్స్‌లలో జరుగుతుంది. 44 ఏళ్ల రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. 2022 అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.