Ukraine vs Russia: రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ.. చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాకు ఉక్రెయిన్ మరోసారి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. సమర ప్రాంతంలోని సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో మెరుపుదాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆయిల్ రిఫైనరీకి గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. జూలై 11-12 తేదీల మధ్య ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఏడాదికి సుమారు 8.5మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఈ రిఫైనరీకి ఉంది. సమర ప్రాంతానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఇంధనాన్ని ఈ రిఫైనరీ నుంచే సరఫరా చేస్తారు. రష్యా సైన్యం కూడా ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆధీనంలోని రోస్‌నెఫ్ట్ కార్పొరేషన్ ఈ రిఫైనరీని నిర్వహిస్తోంది.
వివరాలు
లాజిస్టిక్స్ సేవలు, సైనిక సామగ్రి, ఇతర కార్గో రవాణాకు ధ్వంసమైన ఫెర్రీలు
తాజా దాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదే రిఫైనరీపై ఉక్రెయిన్ ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులు చేసింది. ఏప్రిల్ 18, మే 11 తేదీల్లో జరిగిన దాడుల తర్వాత తాజాగా మరోసారి దీనినే లక్ష్యంగా చేసుకుంది.
అంతేకాకుండా అజోవ్ సముద్రంలో ప్రయాణిస్తున్న 10 చమురు ట్యాంకర్లు, నాలుగు ఫెర్రీలను కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ఈ ట్యాంకర్ల ద్వారా రష్యా చమురును విదేశాలకు తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
అలాగే ధ్వంసమైన ఫెర్రీలను రష్యా సైన్యానికి అవసరమైన లాజిస్టిక్స్ సేవలు, సైనిక సామగ్రి, ఇతర కార్గో రవాణాకు వినియోగిస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
రష్యా ఇంధన సరఫరా వ్యవస్థ, సైనిక లాజిస్టిక్స్‌పై ఒత్తిడి
మరోవైపు, జూలై 11న టోక్‌మాక్ ప్రాంతంలో భారీ మొత్తంలో లూబ్రికెంట్ ఆయిల్‌ను తరలిస్తున్న ఓ రైలును కూడా ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి.
దీంతో పాటు రష్యాకు చెందిన పలు చమురు ట్యాంకర్లపై కూడా విజయవంతంగా దాడులు నిర్వహించినట్లు ఉక్రెయిన్ రక్షణ దళాలు ప్రకటించాయి.
ఈ వరుస దాడులతో రష్యా ఇంధన సరఫరా వ్యవస్థ, సైనిక లాజిస్టిక్స్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.