Ukraine : ఉక్రెయిన్‌లో అవినీతి కలకలం: దేశ సరిహద్దులో మాజీ ఇంధన మంత్రి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ మాజీ ఇంధన శాఖ మంత్రి జర్మన్ గలుష్చెంకోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ పదవిని కోల్పోయిన ఆయన, రైల్లో ఉక్రెయిన్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పట్టుబడినట్లు సమాచారం. ఆయన ఎక్కడికి వెళ్లాలని భావించారన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. నవంబర్‌లో బయటపడిన దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) అవినీతి కేసులో పలువురు ప్రభుత్వ పెద్దలతో పాటు గలుష్చెంకో పేరు కూడా ఉండటంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రభుత్వానికి ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది.
వివరాలు
జాతీయ అవినీతి నిరోధక సంస్థ నాబు'ఆపరేషన్ మిడాస్'
ఈకేసు నేపథ్యంలో జెలెన్స్కీ ముఖ్యసలహాదారు ఆండ్రి యెర్మాక్ రాజీనామా చేయగా,అధ్యక్షుడిపై మాత్రం ఎలాంటి ఆరోపణలు లేవు. జాతీయ అవినీతి నిరోధక సంస్థ నాబు'ఆపరేషన్ మిడాస్'పేరుతో చేపట్టిన దర్యాప్తులో భాగంగా సరిహద్దు దాటుతున్న సమయంలో గలుష్చెంకోను అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. ఇంధన రంగంలో,ముఖ్యంగా అణు విద్యుత్ సంస్థ ఎనెర్గోఅటామ్‌లో కాంట్రాక్టుల పేరుతో భారీగా కమీషన్లు వసూలు చేసి విదేశాలకు,రష్యాకు కూడా డబ్బులు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. శీతాకాలానికి ముందు రష్యా దాడులతో ఇప్పటికే ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్న వేళ ఈ అవినీతి వ్యవహారం బయటపడటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. యూరోపియన్ యూనియన్‌లో చేరాలంటే అవినీతిపై కఠినచర్యలు తప్పనిసరి కావడంతో ఈకేసు ఉక్రెయిన్ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.