UN: యువతపై ప్రభుత్వ అణచివేత అంటూ ఐరాస ప్రతినిధి ఆరోపణలు.. భారత్ కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో యువత చేపడుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై పోరాడుతున్న యువత ప్రభుత్వ వివక్ష, అణచివేతలను ఎదుర్కొంటోందని ఆమె ఆరోపించారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు యువతకు తగిన స్వేచ్ఛ లేదని పేర్కొంటూ.. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పలు నివేదికలను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను ఐరాసలో భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ తీవ్రంగా ఖండించారు. గినా రొమెరో వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
అధికారిక ధ్రువీకరణ లేని నివేదికల ఆధారంగా ఆరోపణలా?
భారత్లో యువత వివక్ష, అణచివేతలను ఎదుర్కొంటోందంటూ గినా రొమెరో చేసిన వ్యాఖ్యలను అనుజ్ స్వరూప్ తోసిపుచ్చారు.
అధికారికంగా ధ్రువీకరించని కొన్ని కథనాలను ఆధారంగా చేసుకొని ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి సమర్పించిన నివేదికలను భారత్ గమనించింది.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుంది.
స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత పత్రికారంగం, జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలు పౌరుల హక్కులను పరిరక్షిస్తున్నాయని ఆయన వివరించారు.
వివరాలు
యువత వివక్షకు గురవుతోంది
కేవలం పేరు లేని కొన్ని నివేదికలను ఆధారంగా చేసుకొని.. ఒక దేశంలోని యువత వివక్షకు గురవుతోందని వాదించడం సరైన విధానం కాదని అనుజ్ స్వరూప్ పేర్కొన్నారు.
ఇలాంటి అత్యున్నత స్థాయి సమావేశాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వల్ల ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువత.. అణచివేత ఎక్కడ?
భారత్లో యువత ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమాన్ని సృష్టించిందని అదే నివేదిక పేర్కొనడాన్ని అనుజ్ స్వరూప్ ప్రస్తావించారు.
దేశంలో ప్రభుత్వ అణచివేత కొనసాగుతోందన్న ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు.
యువతకు స్వేచ్ఛ లేకుండా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంటే.. వారు నాయకులను ఎలా ప్రశ్నించగలుగుతున్నారని, దేశ రాజధానిపైకి ఎలా దూసుకురాగలుగుతున్నారని నిలదీశారు.
భారత్లో యువత ఆందోళనలు చేపట్టినప్పుడు నాయకులకు, నిరసనకారులకు మధ్య చర్చలు ప్రభావవంతంగా జరుగుతాయని ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ పేర్కొన్న విషయాన్ని కూడా భారత దౌత్యవేత్త గుర్తుచేశారు.
బహుశా ఈ సమాచారం గినా రొమెరో దృష్టికి చేరలేదేమోనంటూ చురకలు అంటించారు.
వివరాలు
ప్రభుత్వం స్పందించిన తీరును ప్రస్తావించిన భారత్
ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల విద్యార్థులు చేపట్టిన నిరసనల విషయంలో భారత ప్రభుత్వం స్పందించిన తీరును కూడా అనుజ్ స్వరూప్ ప్రస్తావించారు.
విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
భారత అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
యువత సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు పనిచేస్తున్నాయని పేర్కొంటూ.. ఐరాస ప్రత్యేక ప్రతినిధి చేసిన ఆరోపణలను భారత దౌత్యవేత్త ఖండించారు.