Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. 24 గంటల్లో మరో హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సింగ్డి జిల్లాలో మణి చక్రవర్తి అనే హిందూ కిరాణా దుకాణ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్ బజార్‌లో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మణి చక్రవర్తి అక్కడే ఓ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో దుకాణంలో ఉండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా షాపులోకి చొరబడి అతనిపై పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Details
గడిచిన 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్య
తీవ్రంగా గాయపడిన మణిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మణి చక్రవర్తి మంచి వ్యాపారిగా, శాంతస్వభావంతో ఉన్న వ్యక్తిగా పేరొందాడని, అతనికి ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని తోటి వ్యాపారులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో తమలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని స్థానిక హిందూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గడిచిన 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.