Thwaites Glacier: అంటార్కిటికాలో కలకలం.. డూమ్స్‌డే గ్లేసియర్‌లో వరుస భూకంపాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంటార్కిటికాలోని థ్వైట్స్ గ్లేసియర్ (Thwaites Glacier) డూమ్స్‌డే గ్లేసియర్‌గా ఈ భారీ మంచు కొండ ప్రసిద్ధి చెందింది. గత దాదాపు 13 ఏళ్లలో వందల సంఖ్యలో గ్లేషియల్ భూకంపాలకు గురైనట్లు తాజా పరిశోధన వెల్లడించింది. ఈ గ్లేసియర్ పూర్తిగా కూలిపోయినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం దాదాపు 10 అడుగులు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు థాన్-సోన్ ఫామ్ (Thanh-Son Pham) నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం, థ్వైట్స్ స్థిరత్వంపై ఇప్పటివరకు చేసిన అంచనాలు తప్పుగా ఉండొచ్చని సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
Details
362 గ్లేషియల్ భూకంపాలు
2010 నుంచి 2023 మధ్యకాలంలో ఈ గ్లేసియర్ వందల సంఖ్యలో ఐస్‌బర్గ్ భూకంపాలను ఎదుర్కొందని, అయితే ఇవి తక్కువ ఫ్రీక్వెన్సీ గల సీస్మిక్ తరంగాలు కావడంతో చాలా ఘటనలు గుర్తించబడలేదని పరిశోధకులు చెబుతున్నారు. Geophysical Research Letters జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గత దశాబ్దానికి పైగా కాలంలో అంటార్కిటికాలో మొత్తం 362 గ్లేషియల్ భూకంపాలు సంభవించగా, అందులో 245 భూకంపాలు ఒక్క థ్వైట్స్ గ్లేసియర్‌లోనే చోటుచేసుకున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే వేగంగా కరుగుతున్న ఈ మహా గ్లేసియర్‌కు, ఇప్పుడు వరుస భూకంపాల ప్రభావం కూడా తోడవ్వడంతో ప్రపంచ తీర ప్రాంతాలకు ముప్పు మరింత పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Details
గ్లేషియల్ భూకంపాలంటే ఏమిటి?
గ్లేషియల్ భూకంపాలు అనేవి తక్కువ ఫ్రీక్వెన్సీ గల సీస్మిక్ తరంగాలను ఉత్పత్తి చేసే ప్రత్యేక భూకంపాలు. వీటి తీవ్రత సాధారణంగా మాగ్నిట్యూడ్ 5 వరకు ఉంటుంది. ఇవీ తొలిసారిగా 2003లో గుర్తించారు. భారీ ఐస్‌బర్గులు కూలిపోయినప్పుడు ఇవి సంభవిస్తాయి. ఇప్పటివరకు ఎక్కువగా గ్రీన్‌లాండ్ తీర ప్రాంతాల్లోనే ఇవి నమోదు కాగా, అంటార్కిటికాలోనూ ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానించారు. అయితే తక్కువ తీవ్రత కారణంగా వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో థాన్-సోన్ ఫామ్ బృందం అంటార్కిటికాలోని స్థానిక సీస్మిక్ స్టేషన్ల డేటాను విశ్లేషించి, గతంలో గ్లోబల్ సీస్మిక్ నెట్‌వర్క్ గుర్తించలేకపోయిన అనేక భూకంపాలను గుర్తించింది.
Details
థ్వైట్స్‌లో ఏమి జరుగుతోంది?
డూమ్స్‌డే గ్లేసియర్‌లో గత మూడు దశాబ్దాల్లో మంచు ప్రవాహం రెట్టింపు అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేగవంతమైన కరుగుదలతో పాటు గ్లేషియల్ భూకంపాలు సమాంతరంగా చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. థ్వైట్స్‌తో పాటు కొద్ది భూకంపాలు పైన్ ఐలాండ్ గ్లేసియర్ వద్ద కూడా నమోదయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా, ఈ రెండు ప్రాంతాల్లోనూ నమోదైన భూకంపాలు ఐస్‌బర్గులు తలకిందులుగా పడిపోవడం వల్ల కాదని అధ్యయనం పేర్కొంది. పైన్ ఐలాండ్ గ్లేసియర్‌లో భూకంపాల స్వభావం ఇప్పటికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరం" అని పరిశోధకులు వ్యాఖ్యానించారు.