Loading...
Pakistan: పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన సాయుధులు!
పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన సాయుధులు!

Pakistan: పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన సాయుధులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిక్షణ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్తున్న 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను సాయుధులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన క్వెట్టా-కరాచీ హైవేపై చోటుచేసుకుంది. మోటార్‌ సైకిళ్లపై వచ్చిన సాయుధులు ఓ ప్యాసింజర్ వ్యాన్‌ను అడ్డుకుని, అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుళ్లను అపహరించి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.

వివరాలు

శిక్షణ పూర్తిచేసుకుని వెళ్తుండగా కిడ్నాప్

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని కలత్ పోలీసు శిక్షణా కేంద్రంలో ఇటీవల పలువురు కానిస్టేబుళ్లు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు.

విధుల్లో చేరడానికి మరికొన్ని రోజుల సమయం ఉండటంతో 20 మంది కానిస్టేబుళ్లు తమ ఇళ్లకు బయల్దేరారు.

ఈ క్రమంలో శనివారం వారు క్వెట్టా-కరాచీ హైవేపై ఓ ప్యాసింజర్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో మోటార్‌ సైకిళ్లపై వచ్చిన కొందరు సాయుధులు ఆ వ్యాన్‌ను అడ్డగించారు.

అనంతరం వాహనంతో పాటు అందులో ఉన్న 20 మంది కానిస్టేబుళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారందరినీ గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు

డ్రైవర్‌, మరో ముగ్గురు ప్రయాణికులను విడిచిపెట్టిన సాయుధులు

వ్యాన్‌లో ఉన్న 20 మంది కానిస్టేబుళ్లను అపహరించిన సాయుధులు.. వాహన డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులను మాత్రం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను మాస్తుంగ్‌ పోలీసులు ధ్రువీకరించారు. అపహరణకు గురైన సిబ్బంది లెవీస్‌ ఫోర్స్‌కు చెందినవారని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

కానిస్టేబుళ్ల కోసం పర్వత ప్రాంతాల్లో గాలింపు

కానిస్టేబుళ్ల అపహరణ ఘటనతో పాకిస్థాన్‌ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అపహరణకు గురైన సిబ్బంది ఆచూకీని గుర్తించేందుకు సమీపంలోని పర్వత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే 20 మంది కానిస్టేబుళ్లను కిడ్నాప్‌ చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు.

ఈ అపహరణ వెనుక ఎవరున్నారు? కానిస్టేబుళ్లను ఎక్కడికి తీసుకెళ్లారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT