Loading...
US-Saudi Arabia: సౌదీకి 48 ఎఫ్‌-35 విమానాలు.. 24.3 బిలియన్‌ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం
సౌదీకి 48 ఎఫ్‌-35 విమానాలు.. 24.3 బిలియన్‌ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం

US-Saudi Arabia: సౌదీకి 48 ఎఫ్‌-35 విమానాలు.. 24.3 బిలియన్‌ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత సౌదీ అరేబియా చేపడుతున్న మరో భారీ ఆయుధ కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలిపింది. సుమారు 24.3 బిలియన్‌ డాలర్ల విలువైన 48 ఎఫ్‌-35 స్టెల్త్‌ యుద్ధవిమానాలను సౌదీకి విక్రయించేందుకు అనుమతించినట్లు అమెరికా విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ విక్రయం ద్వారా సౌదీ రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది. ఎఫ్‌-35 విమానాలను కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఈ విమానాలను నడుపుతున్న ఏకైక దేశమైన ఇజ్రాయెల్‌.. రియాద్‌కు వీటి విక్రయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సౌదీతో సంబంధాలను సాధారణీకరించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తోంది.

వివరాలు 

సౌదీ రక్షణ సామర్థ్యం పెంపే లక్ష్యం

ప్రతిపాదిత విక్రయం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనేందుకు సౌదీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

దేశీయ రక్షణ వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు, అమెరికా బలగాలతో సమన్వయం మెరుగవుతుందని పేర్కొంది.

సౌదీ వైమానిక దళంలోని విమానాల సామర్థ్యం పెరగడంతో పాటు, గగనతలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి భూమిపైకి దాడులను ఎదుర్కొనే రక్షణ సామర్థ్యం కూడా మెరుగవుతుందని వివరించింది.

ఈ ప్రతిపాదిత విక్రయంపై అమెరికా విదేశాంగ శాఖ.. కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది.

ఒప్పందం అమలుకు అమెరికా చట్టసభ సభ్యుల ఆమోదం అవసరం. అయితే, విమానాల సరఫరా ఎప్పటిలోగా జరుగుతుందనే విషయాన్ని శాఖ వెల్లడించలేదు.

ఈ విక్రయం వల్ల ప్రాంతీయ సైనిక సమతౌల్యంలో మార్పు ఉండదని కూడా పేర్కొంది.

వివరాలు 

ఇజ్రాయెల్‌ సైనిక ఆధిక్యానికి ప్రాధాన్యం

ప్రాంతీయ ప్రత్యర్థుల కంటే ఇజ్రాయెల్‌కు సైనిక ఆధిక్యం ఉండాలన్న అమెరికా దీర్ఘకాల విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు అమెరికా తన అత్యంత సన్నిహిత మిత్రదేశాలకే ఎఫ్‌-35 విమానాలను విక్రయించేందుకు అనుమతించింది.

వీటిలో యూరప్‌కు చెందిన పలు నాటో దేశాలు, ఇజ్రాయెల్‌ ఉన్నాయి.

రష్యా నుంచి వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడంతో రష్యా ఎఫ్‌-35 సాంకేతికతను పొందే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. నాటో సభ్యదేశమైన టర్కీని అమెరికా 2019లో ఎఫ్‌-35 కార్యక్రమం నుంచి తొలగించింది.

ADVERTISEMENT

వివరాలు 

చైనా నిఘాపై ఆందోళనలు

ఎఫ్‌-35 విమానాలకు సంబంధించిన సాంకేతికత చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా అమెరికాకు ఉన్నాయి.

రియాద్‌తో చైనా భాగస్వామ్యాల ద్వారా బీజింగ్‌ ఎఫ్‌-35 సాంకేతికతను పొందే అవకాశాన్ని అమెరికా నిఘా విశ్లేషకులు పరిశీలిస్తున్నట్లు ఈ వారం 'ది న్యూయార్క్‌ టైమ్స్‌' కథనం ప్రచురించింది.

ఈ కారణాలతో విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన, ప్రతినిధుల సభ నిఘా కమిటీ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు.

అమెరికా సైనిక సాంకేతికతలో అత్యంత కీలకమైన అంశాలు చైనా కమ్యూనిస్టు పార్టీకి అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉందని తమ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న సమయంలో ఈ ఒప్పందం ముందుకు సాగకూడదని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భారీగా ఆయుధాల కొనుగోలు

ఈ ఏడాది సౌదీ అరేబియా కుదుర్చుకుంటున్న పలు భారీ ఆయుధ ఒప్పందాల్లో ఎఫ్‌-35 విక్రయం తాజాది.

సెప్టెంబరు ప్రారంభంలో 10,000కు పైగా బాంబులను సౌదీకి విక్రయించేందుకు అమెరికా 5 బిలియన్‌ డాలర్ల ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

ఇందులో అత్యంత విధ్వంసక సామర్థ్యం కలిగిన 2,000 పౌండ్ల బాంబులు కూడా ఉన్నాయి.

అదే నెలలో 60 ట్యాంకు ఇంజిన్లు, సంబంధిత పరికరాలను 750 మిలియన్‌ డాలర్లకు సౌదీకి విక్రయించేందుకు అమెరికా అనుమతించింది.

జులైలో 1.96 బిలియన్‌ డాలర్ల విలువైన మరో ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది.

దీని కింద రాకెట్లను కచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలుగా మార్చేందుకు ఉపయోగించే మార్గనిర్దేశక విభాగాలను సౌదీ కొనుగోలు చేయనుంది.

వివరాలు 

సౌదీ చుట్టూ పెరుగుతున్న భద్రతా ముప్పులు

అమెరికా,ఇజ్రాయెల్‌ ఫిబ్రవరిలో ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి సౌదీ అరేబియాపై ఇరాన్‌ బలగాలు పలుమార్లు డ్రోన్లు,క్షిపణులతో దాడులు చేశాయి.

ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారుల నుంచి కూడా సౌదీ దాడులను ఎదుర్కొంది.

కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్న యెమెన్‌ అంతర్యుద్ధం జులైలో మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

హౌతీలు,అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సౌదీ మద్దతున్న ప్రభుత్వ బలగాల మధ్య పోరాటం తిరిగి మొదలైంది.

సౌదీపై సముద్ర దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రకటించిన హౌతీలు.. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు.

అమెరికా నేరుగా ఈ ఘర్షణలోకి దిగలేదు. అయితే,సౌదీ బలగాలతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం,ప్రణాళికా సహాయం అందించడాన్ని పెంచేందుకు అమెరికా సైనిక టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోందని ఓ అమెరికా అధికారి ఈ వారం ప్రారంభంలో తెలిపారు.

ADVERTISEMENT