US-Iran: యుద్ధం వేళ కీలక పరిణామం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు అమెరికా వీసా
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు ఆ దేశానికి చెందిన ఇతర కీలక నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. వీరి వీసాలకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ధ్రువీకరించింది.
వివరాలు
యూఎన్ సర్వసభ్య సమావేశానికి హాజరు
వచ్చేవారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది.
ఈ ఉన్నతస్థాయి భేటీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సహా ఆ దేశ ప్రతినిధి బృందం హాజరయ్యేందుకు అమెరికా అనుమతులు మంజూరు చేసింది.
''ఆతిథ్యదేశంగా మాకున్న బాధ్యతలకు అనుగుణంగా ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొననుంది'' అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు.
అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి ఇరాన్ నుంచి వచ్చే ప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
అలాగే ప్రతినిధి బృందంపై ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. విలాస వస్తువులు, ఇతర వస్తువుల కొనుగోలుపైనా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.