Sergio Gor: భారత్ క్లిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉంది.. అమెరికా రాయబారి వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న దేశమని, చుట్టూ ఉన్న కొన్ని పొరుగు దేశాలు నిరంతరం భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్-2026లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు సమీపంలో ఉన్న కొన్ని దేశాల వైఖరి ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని గోర్ అన్నారు. అలాంటి దేశాల్లో ఏదైనా ఒక్కటి అనూహ్యంగా దూకుడుగా వ్యవహరిస్తే మొత్తం ప్రాంతీయ పరిస్థితులు మారిపోయే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ అనేక భద్రతా, వ్యూహాత్మక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు.
వివరాలు
తుది దశకు భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
అలాగే,భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నట్లు సెర్జియో గోర్ తెలిపారు. రక్షణ,ఆధునిక సాంకేతికత,వాణిజ్యం,ఇంధన రంగం,వ్యూహాత్మక భద్రత వంటి కీలక రంగాల్లో ఇరు దేశాలు ఇప్పటికే సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని ఆయన చెప్పారు. ఇంకా మిగిలిన కొద్ది అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని గోర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థిరత్వాన్ని కాపాడడం,ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేయడం,ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడం వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు సాగనున్నాయని ఆయన స్పష్టం చేశారు.