LOADING...
US-Iran War: మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా.. ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా
హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై ఐఆర్‌జీసీ దాడి భారతీయ సిబ్బందిలో ఒకరి గల్లంతు

US-Iran War: మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా.. ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. హర్మూజ్‌ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి చేయడం,దానికి ప్రతిగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం,అనంతరం గల్ఫ్‌ అరబ్‌ దేశాలపై టెహ్రాన్‌ క్షిపణులు,డ్రోన్లతో దాడులకు దిగడం వంటి పరిణామాలతో ఆదివారం ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హర్మూజ్‌ జలసంధిలో ఒమన్‌ తీరానికి సమీపంలో సైప్రస్‌ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ఆదివారం తెల్లవారుజామున దాడి చేసింది. ఘటన సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా,వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. సిబ్బందిలో 23 మందిని ఒమన్‌ అధికారులు సురక్షితంగా రక్షించగా,ఒక భారతీయుడు గల్లంతైనట్లు సమాచారం.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధి మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్ 

దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగడంతో పాటు ఇంజిన్‌ గది తీవ్రంగా దెబ్బతింది. దీంతో నౌక ప్రయాణాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులపై దాడులు వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా, హర్మూజ్‌ జలసంధిని తాము మూసివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు అది మూసివేసే ఉంటుందని తెలిపింది. తమపై మరిన్ని దాడులు జరిగితే పశ్చిమాసియాలోని శత్రు స్థావరాలపై మరింత తీవ్రంగా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే హర్మూజ్‌ మార్గం ప్రస్తుతం అందుబాటులోనే ఉందని అమెరికా ప్రకటించింది.

వివరాలు 

అమెరికా భారీ వైమానిక దాడులు

వాణిజ్య నౌకపై దాడికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 140 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. వీటిలో క్షిపణి, డ్రోన్‌ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఇతర సైనిక స్థావరాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ దాడుల్లో తమ నౌకాదళానికి చెందిన ఒక అధికారి మరణించినట్లు ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థలు తెలిపాయి. హర్మూజ్‌కు సమీపంలోని కెష్మ్‌ ద్వీపంపై కూడా ఆదివారం రాత్రి అమెరికా మరోసారి దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నాయి.

Advertisement

వివరాలు 

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ పలు గల్ఫ్‌ అరబ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. తమ వైపు దూసుకొచ్చిన ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్‌ ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో పేలుళ్లు సంభవించగా ముగ్గురు గాయపడ్డారు. బహ్రెయిన్‌లో క్షిపణి దాడుల హెచ్చరికలతో సైరన్లు మోగాయి. కువైట్‌ వైపు ప్రయాణించిన ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను ఆ దేశ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. హర్మూజ్‌కు సమీపంలోని తమ భూభాగంలో పలు ప్రాంతాలపై డ్రోన్‌ దాడులు జరిగాయని ఒమన్‌ వెల్లడించింది. జోర్డాన్‌పైనా ఇరాన్‌ క్షిపణి దాడులు నిర్వహించినట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

త్వరలో ప్రజల ముందుకు మొజ్తాబా ఖమేనీ

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ త్వరలో ప్రజల ముందుకు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను ఈ నెల 23న టెహ్రాన్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

Advertisement