Page Loader
Trump Tariffs: టారిఫ్‌ల బాంబుతో ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్‌.. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% సుంకం 
. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% సుంకం

Trump Tariffs: టారిఫ్‌ల బాంబుతో ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్‌.. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% సుంకం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలనే కాకుండా, అమెరికన్లను కూడా వణికిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఇప్పటికే వివిధ రంగాలపై భారీ టారిఫ్‌లను విధిస్తూ ఆర్థికంగా ప్రభావం చూపిన ఆయన, తాజాగా సినీ పరిశ్రమను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇతర దేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. హాలీవుడ్‌ను కొందరు విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన ఆయన, తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు.

వివరాలు 

హాలీవుడ్‌ పతన దిశగా - ఇతర దేశాల ప్రోత్సాహకాలు కారణమన్న ట్రంప్‌ 

''అమెరికా సినీ పరిశ్రమ వేగంగా దిగజారిపోతోంది. యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన దర్శకులు, నిర్మాతలు, స్టూడియోలను వేరే దేశాలకు తరలించేందుకు అవి విస్తృతంగా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఫలితంగా హాలీవుడ్‌ సహా ఇతర ప్రాంతీయ సినీ రంగాలు దెబ్బతింటున్నాయి. ఇది ఓ సామూహిక కుట్ర. ఈ కుట్ర అమెరికా జాతీయ భద్రతకే ముప్పుగా మారుతుంది. అందుకే విదేశాల్లో నిర్మించి అమెరికాలోకి తీసుకురావాల్సిన సినిమాలపై 100 శాతం టారిఫ్‌ విధించే చర్యలను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు తగిన అధికారాలను ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను'' అని ట్రంప్‌ వివరించారు.

వివరాలు 

అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న పరిశ్రమ 

అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. ''మేము ఈ అంశంపై ఇప్పటికే పనిచేస్తున్నాం'' అని చెప్పారు. అయితే ఈ టారిఫ్‌లు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. విదేశీ నిర్మాణ సంస్థలు అమెరికాలో విడుదల చేసే చిత్రాలకేనా, లేక అమెరికా కంపెనీలు విదేశాల్లో నిర్మించే చిత్రాలకూనా అన్నది తేలాల్సి ఉంది. తక్షణానికి అధికారిక సమాచారం వెలువడనుందన్న అంచనాలు ఉన్నాయి.

వివరాలు 

మేధో సంపత్తిపై పన్నుల వ్యవహారం 

ప్రస్తుతం సినిమాలను సాధారణ వస్తువులుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తున్న నేపథ్యంలో వీటిపై పన్నులు వేయడం సాధారణంగా జరగదు. అయితే, హాలీవుడ్‌ బయట చిత్రీకరణ జరిపే సినిమాలు, టీవీ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ పన్ను మినహాయింపులను అందిస్తున్నాయి. ఈ విధమైన ప్రోత్సాహకాలు నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షిస్తూ, టొరంటో (కెనడా), డబ్లిన్‌ (ఐర్లాండ్‌) వంటి నగరాలకు వలస వెళ్లేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరిశ్రమను కాపాడేందుకు ట్రంప్‌ తీసుకుంటున్న తాజా నిర్ణయాలే ఇవని అర్థమవుతోంది.