Lindsey Graham: 'సుంకాలు తగ్గించమని భారత్ కోరింది': అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్
ఈ వార్తాకథనం ఏంటి
టారిఫ్‌లను తగ్గించాలంటూ భారత్ కోరిందని అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించిందని,ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివరించి 25 శాతం సుంకం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా తనను కోరినట్లు గ్రాహమ్ మీడియాకు తెలిపారు. గత నెలలో తనకు, భారత రాయబారికి మధ్య ఈ చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. ''గత నెల భారత రాయబారి నివాసానికి వెళ్లాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించిందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో టారిఫ్‌ల తగ్గింపుపై ట్రంప్‌కు చెప్పాలని కోరారు'' అని లిండ్జీ గ్రాహమ్ వ్యాఖ్యానించారు.
వివరాలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం పన్ను
ఈ వ్యాఖ్యలు మీడియాతో వెల్లడిస్తున్న సమయంలో ఆయన పక్కనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండటం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం పన్ను విధిస్తూ 'ఆర్థిక బంకర్ బస్టర్' తరహా చర్యలు తీసుకుంటామని గ్రాహమ్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా,సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ''ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు.నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే, సుంకాలను చాలా వేగంగా పెంచుతాం'' అంటూ గ్రాహమ్ చేసిన హెచ్చరికల ఆడియో క్లిప్‌ను శ్వేతసౌధం అధికారిక ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసింది.