LOADING...
US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైనిక చర్యలు ప్రారంభించింది. హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అత్యంత విలువైన వాణిజ్య నౌకపై శుక్రవారం ఇరాన్‌ డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో, అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) వెల్లడించిన వివరాల ప్రకారం, హర్మూజ్‌ జలసంధికి సమీపంలోని ఇరాన్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధవిమానాలతో దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్‌ నిల్వ స్థావరాలు, రాడార్‌ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, దీనికి ప్రతిస్పందనగా ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కూడా గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది.

వివరాలు

కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది?

ఈ పరిణామాలపై సెంట్‌కామ్‌ స్పందిస్తూ, వాణిజ్య నౌకపై ఇరాన్‌ బలగాలు జరిపిన దాడి ఎలాంటి ప్రేరణ లేకుండానే జరిగిందని పేర్కొంది. అలాగే, అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించిన చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల్లో రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి దాడులు నిర్వహించడం ప్రపంచ నౌకాయాన భద్రతకు ముప్పుగా మారిందని తెలిపింది. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అవసరమైన భద్రతా సహకారం అందిస్తూనే ఉంటామని, ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా అమెరికా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించింది.

వివరాలు

శాంతి ఒప్పందం ఏమైంది? 

ప్రతీకార దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం అవివేకపూరిత చర్య అని విమర్శించారు. అంతేకాకుండా, ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంటూ, అమెరికా దీనికి తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్సేపటికే అమెరికా యుద్ధవిమానాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలు, పరస్పర దాడుల నేపథ్యంలో ఆ ఒప్పందం భవితవ్యంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.

Advertisement