Loading...
America: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్

America: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పలాటైన్‌కు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ ఈ దాడికి ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారతీయులపై తీవ్ర విద్వేషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు,ఇతరుల ముందు కూడా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది. పాపోరాకిస్ సామూహిక కాల్పులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్టోబర్ 11న పలాటైన్,మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు.

వివరాలు 

భారతీయులపై తీవ్ర విద్వేషం

అనుమానితుడిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాపోరాకిస్ టాకోబెల్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

దర్యాప్తులో భాగంగా అతడి ఎలక్ట్రానిక్ పరికరాలు,సమాచారాన్ని పరిశీలించిన పోలీసులకు 'వై ఐ ఫాట్: ఏకేఏ(అరోరా షూటర్స్ మేనిఫెస్టో)'పేరుతో ఉన్న ఓ పత్రం కనిపించింది.

అందులో శ్వేతజాతి ఆధిపత్యవాద,తీవ్రవాద భావజాలంతోపాటు దక్షిణాసియా ప్రజలు,ముఖ్యంగా భారతీయులపై హింసకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అతడితో కలిసి పనిచేసిన ఉద్యోగుల వాంగ్మూలాల ప్రకారం..పాపోరాకిస్ ఇతర జాతుల ప్రజలపై అవమానకర వ్యాఖ్యలు చేసేవాడు.

భారతీయులపై ప్రత్యేకంగా ద్వేషం ప్రదర్శించేవాడని వారు వెల్లడించారు.అక్టోబర్ 11న దాడికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఆ తేదీ ప్రత్యేకమైనదని అతడు తన సహోద్యోగులతో చెప్పినట్లు దర్యాప్తులో తెలిసింది.

వివరాలు 

ఇంట్లో రైఫిల్, తూటాలు స్వాధీనం

పాపోరాకిస్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి రైఫిల్, తూటాలు, బాడీ ఆర్మర్‌తోపాటు ఇతర వ్యూహాత్మక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

దాడికి సంబంధించిన వివరాలను అతడు మరో వ్యక్తికి కూడా పంపినట్లు తెలుస్తోంది.

అయితే, ఏ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడనే విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

అతడి కాల్పుల ప్రణాళిక అమలుకాకపోవడానికి తుపాకీ జామ్ కావడం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశాలను తెలుసుకునేందుకు అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

యువకుడిపై రెండు అభియోగాలు

ఈ కేసులో పాపోరాకిస్‌పై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఒక అభియోగంతోపాటు, రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నాడనే మరో అభియోగాన్ని నమోదు చేశారు.

దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కేసులో లభించే ఆధారాలను బట్టి మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ విచారణలో అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా పోలీసులకు సహకరిస్తోంది.

కుక్ కౌంటీ కోర్టులో బుధవారం హాజరైన పాపోరాకిస్‌ను కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

హిందూ ఆలయాలకు పోలీసుల హెచ్చరికలు

ఈ ఘటన నేపథ్యంలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని హిందూ ప్రార్థనా మందిరాలను పోలీసులు అప్రమత్తం చేశారు.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆ రాష్ట్రంలో మొత్తం 58 హిందూ ఆలయాలు ఉన్నాయి.

భక్తులు, ఆలయాల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఘటనపై స్పందించిన హిందూ అమెరికన్ ఫౌండేషన్.. పోలీసులు సకాలంలో స్పందించి ముప్పును అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది.

అనుమానాస్పద కార్యకలాపాలు, ముప్పు సూచించే సమాచారం ఏదైనా కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT