LOADING...
US: భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా 
భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా

US: భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో, భారత్‌కు వెనెజువెలా చమురును సరఫరా చేసే అవకాశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం వెలువడింది. అమెరికా నియంత్రణలోకి వచ్చిన కొత్త చట్టం ఆధారంగా, వెనెజువెలా చమురును భారత్‌కు విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైట్‌హౌస్‌కు చెందిన అధికార వర్గాలు వెల్లడించాయి. వెనెజువెలా నుంచి అమెరికాకు 30 నుంచి 50 మిలియన్‌ బ్యారెళ్ల చమురు బదిలీ కానున్న నేపథ్యంలో, ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్‌లో వివిధ దేశాలకు విక్రయించాలన్న యోచనలో అమెరికా ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా భారత్‌కు కూడా చమురు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

వివరాలు 

వెనెజువెలా,అమెరికా ప్రజలప్రయోజనాల కోసం వినియోగం 

వెనెజువెలా చమురుపై అమెరికా రిఫైనరీలతో పాటు ఇతర దేశాలు కూడా గణనీయమైన ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదేసమయంలో, వెనెజువెలాలోని తాత్కాలిక ప్రభుత్వ అధికారులు అధిక నాణ్యత గల 30-50 మిలియన్‌ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో ఈ వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వెనెజువెలా నుంచి అందుకునే చమురును మార్కెట్‌ ధరలకే విక్రయిస్తామని,ఆ ద్వారా వచ్చే నిధులు పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటాయని ట్రంప్‌ తెలిపారు. ఆ ఆదాయాన్ని వెనెజువెలా,అమెరికా ప్రజలప్రయోజనాల కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఇంధనశాఖ కార్యదర్శి క్రిస్‌ రైట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి,నేరుగా అమెరికా ఓడరేవుల్లో దించనున్నట్లు కూడా వివరించారు.

Advertisement