Loading...
JD Vance: దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం
దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం

JD Vance: దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో చర్చలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నంత కాలం టెహ్రాన్‌తో చర్చలు జరిపే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ వ్యవహరించే తీరును బట్టి తమ సైనిక చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ఈ ఆపరేషన్లకు ఎలాంటి గడువు నిర్ణయించలేదని తెలిపారు. వైట్‌హౌస్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్‌ ఈ విషయాలను వెల్లడించారు. వాణిజ్య నౌకలపై దాడులు ఆపనంత వరకు ఇరాన్‌తో చర్చలు ఉండవని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్‌పై అన్ని రకాల ఒత్తిళ్లు కొనసాగుతాయని హెచ్చరిక

ప్రస్తుతం అమెరికా ప్రధాన దృష్టి హర్మూజ్‌ జలసంధి మీదే ఉందని వాన్స్‌ చెప్పారు.

ఈ మార్గం ద్వారా ఇంధన రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

అమెరికా చేపట్టిన చర్యల కారణంగా గురువారం రాత్రి హర్మూజ్‌ జలసంధి నుంచి 1.5కోట్ల బ్యారెళ్ల చమురు బయటకు వెళ్లిందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత,సంక్షోభం తలెత్తకుండా తమ చర్యలు సహాయపడ్డాయని తెలిపారు.

ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచేందుకు అమెరికా వద్ద అనేక మార్గాలు ఉన్నాయని వాన్స్‌ చెప్పారు.

ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన చర్యలతో పాటు రహస్య మార్గాలను కూడా ఉపయోగించే అవకాశం ఉందన్నారు.

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తిరిగి నిర్మించకుండా అడ్డుకోవడం కూడా అమెరికా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేశారు.

వివరాలు 

అమెరికాకు చైనా కొంత సహకరిస్తోందని వాన్స్‌ వ్యాఖ్య

ఇరాన్‌పై ఒత్తిడి పెంచే విషయంలో చైనా కూడా సహకరిస్తోందని వాన్స్‌ తెలిపారు.

టెహ్రాన్‌కు అందే ఆర్థిక సేవలను పరిమితం చేసే అంశంలో అమెరికా చేసిన కొన్ని అభ్యర్థనలకు చైనా స్పందించిందని చెప్పారు.

టర్కీ, అజర్‌బైజాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు సహకరిస్తున్నాయని వెల్లడించారు.

ప్రపంచ చమురు రవాణాలో హర్మూజ్‌ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది.

గల్ఫ్‌ దేశాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు భారీగా చమురు తరలించే ప్రధాన మార్గం ఇదే.

ఈ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఇంధన ధరలు, నౌకల బీమా వ్యయం, రవాణా ఖర్చులు పెరిగే పరిస్థితి ఏర్పడొచ్చు.

ADVERTISEMENT