Venezuela: వెనెజువెలాలో భూకంపాల బీభత్సం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కేవలం సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ప్రకృతి విపత్తుతో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గల్లంతైన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు ఈ విపత్తులో 235 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెనెజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. భవనాల శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరుస భూకంపాల అనంతరం దాదాపు 40 వేల మందికి ఆచూకీ తెలియడం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
లా గువేరాలోనే 100కు పైగా భవనాలు నేలమట్టం
వెనెజువెలా రాజధాని కారకాస్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో భూప్రకంపనలు సంభవించాయి. అయితే తీర ప్రాంత నగరమైన లా గువేరా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. భూకంపం ధాటికి నగరం భారీగా దెబ్బతింది. అక్కడ 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఐరాస ప్రతినిధులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కూడా కష్టంగా మారిందని పేర్కొన్నారు. శిథిలాలను తొలగించేందుకు ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు.
వివరాలు
భూకంపం తర్వాత 'ఎక్స్'పై ఆంక్షల ఎత్తివేత
భూకంపం నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సమాచారం వేగంగా చేరేలా సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఐరాస ప్రతినిధులు వెనెజువెలా ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు సహాయక సమాచారం, అత్యవసర సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు వివరించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనెజువెలా పౌరులకు 'ఎక్స్' మళ్లీ అందుబాటులోకి వచ్చింది. 2024లో అధ్యక్షుడు మదురో అధికారంలో ఉన్న సమయంలో ఈ మైక్రోబ్లాగింగ్ వేదికపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
వివరాలు
అమెరికా సహా పలు దేశాల నుంచి భారీ సహాయం
ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాకు అండగా నిలవడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని అందజేస్తామని అమెరికా ప్రకటించింది. ఈ సహాయాన్ని తరలించేందుకు ఇప్పటికే రెండు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, మానవతా సహాయం అందించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించాయి.