Loading...
flydubai incident: ఫ్లైదుబాయ్‌ విమానంలో హింసాత్మక ఘటన.. కో-పైలట్‌పై గతంలోనే నిషేధం!
ఫ్లైదుబాయ్‌ విమానంలో హింసాత్మక ఘటన.. కో-పైలట్‌పై గతంలోనే నిషేధం!

flydubai incident: ఫ్లైదుబాయ్‌ విమానంలో హింసాత్మక ఘటన.. కో-పైలట్‌పై గతంలోనే నిషేధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానంలో భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ (Captain Smit Machchhar)పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ హమామ్‌ అల్‌హమామీపై ఒమన్‌ ప్రభుత్వం గతంలోనే కీలక చర్యలు తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అతడికి తీవ్రవాద భావజాలం ఉందన్న కారణంతో విమానాలు నడపకుండా ఒమన్‌ ప్రభుత్వం నిషేధం విధించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఫ్లైదుబాయ్‌ విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చివేయాలనే ఉద్దేశంతోనే అల్‌హమామీ ఈ దాడికి పాల్పడినట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది నిర్ధరణ జరగాల్సి ఉంది.

వివరాలు

ఒమన్‌ ఎయిర్‌లో కో-పైలట్‌ ట్రైనీగా..

ఒమన్‌ దేశస్థుడైన హమామ్‌ అల్‌హమామీ 2024లో ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ ఒమన్‌ ఎయిర్‌లో కో-పైలట్‌ ట్రైనీగా పనిచేశాడు.

ఆ సమయంలో అతడి ప్రవర్తనపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత కథనాలు పేర్కొంటున్నాయి.

దీంతో భద్రతా అధికారులు అతడు విమానాలు నడపకుండా నిషేధం విధించినట్లు సమాచారం. అయితే.. విమానాలు నడపకుండా నిషేధం విధించినప్పటికీ, అతడిని సంస్థలోని అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో కొనసాగించినట్లు తెలుస్తోంది.

అల్‌హమామీ కొంతకాలం సిరియాలో కూడా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలోనే అతడు తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. అల్‌హమామీకి ఏదైనా తీవ్రవాద సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? అనే విషయం మాత్రం ఇప్పటివరకు నిర్ధరణ కాలేదు.

వివరాలు

ఇతర దేశాల్లోనూ విమానయాన సంస్థల్లో ఉద్యోగం..

ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధం ఉన్నప్పటికీ.. అల్‌హమామీ ఇతర దేశాల్లోని విమానయాన సంస్థల్లో పనిచేసినట్లు తెలుస్తోంది.

అతడి పేరుతో ఉన్న లింక్డ్ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. అల్‌హమామీ ఒమన్‌ ఎయిర్‌లో సుమారు ఏడేళ్ల పాటు పనిచేశాడు. 2025 ఫిబ్రవరిలో ఆ సంస్థను వీడినట్లు ప్రొఫైల్‌ ద్వారా తెలుస్తోంది.

ఆ తర్వాత 2025 జూన్‌లో మొరాకో జాతీయ విమానయాన సంస్థ రాయల్‌ ఎయిర్‌ మారోక్‌లో చేరాడు. అక్కడ కూడా ఎక్కువ కాలం పనిచేయలేదు.

2026 జనవరిలో ఆ ఉద్యోగాన్ని వదిలి ఫ్లైదుబాయ్‌లో చేరినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుత ఘటన జరిగిన అనంతరం అల్‌హమామీకి చెందిన లింక్డ్ఇన్‌ ఖాతా డిలీట్‌ కావడం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు

సోషల్‌ మీడియా ఖాతాల్లో అనుమానాస్పద అంశాలు..

ఇదిలా ఉండగా.. అల్‌హమామీకి చెందినవిగా భావిస్తున్న కొన్ని సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ అనుమానాస్పద అంశాలను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ కాక్‌పిట్‌ నుంచి తీసిన వీడియోలు, ఇజ్రాయెల్‌ విమానాలకు సంబంధించిన దృశ్యాలు ఆ ఖాతాల్లో ఉన్నట్లు సమాచారం.

ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులు.. అల్‌హమామీ ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే ఘటన వెనుక అసలు ఉద్దేశం, అతడికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT