Loading...
PHP programming language: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్‌సైట్లు.. అసలు కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్‌సైట్లు.. అసలు కారణం ఇదేనా?

PHP programming language: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్‌సైట్లు.. అసలు కారణం ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు నిలిచిపోయాయి. కీలకమైన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నేపథ్యంలో సైబర్‌ దాడుల ముప్పు నుంచి తమ వ్యవస్థలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వెబ్‌సైట్లను వెంటనే అప్‌డేట్‌ చేయాలని, లేదంటే తాత్కాలికంగా నిలిపివేయాలని భద్రతా సంస్థలు హెచ్చరించినట్లు సమాచారం. ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? వెబ్‌సైట్ల భద్రతకు ముప్పు తెచ్చిన ఆ లోపాలేంటి?

వివరాలు

పీహెచ్‌పీలో తీవ్రమైన భద్రతా లోపాలు

ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్లు, వెబ్‌ అప్లికేషన్ల అభివృద్ధికి ఉపయోగించే ప్రోగ్రామింగ్‌ భాషల్లో పీహెచ్‌పీ (PHP) ఒకటి. దీనికి సంబంధించి ఆగస్టులో అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడినట్లు కథనంలో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికిపైగా వెబ్‌సైట్లు పీహెచ్‌పీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ (AI) మోడళ్ల సాయంతో సైబర్‌ భద్రతా నిపుణులు ఈ లోపాలను గుర్తించారు.

వీటిని 'పీహెచ్‌పీ2షెల్‌' (PHP2Shell) అని పిలుస్తున్నారు. కాలం చెల్లిన పీహెచ్‌పీ వెర్షన్లతో పనిచేస్తున్న సర్వర్లపై హ్యాకర్లు దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ లోపాలను ఆసరాగా చేసుకుని పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే సర్వర్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు.

వివరాలు

వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని పీహెచ్‌పీ ఫౌండేషన్‌ హెచ్చరిక

అంతేకాకుండా, సర్వర్లలో తమకు నచ్చిన కోడ్‌ను అమలు చేయడంతో పాటు వాటిపై నియంత్రణ సాధించగలరనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

అదే జరిగితే ఆయా వెబ్‌సైట్లు, వాటికి సంబంధించిన వ్యవస్థల భద్రత తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ భద్రతా లోపాలపై పీహెచ్‌పీ ఫౌండేషన్‌ స్పందించింది.

సాఫ్ట్‌వేర్‌ చరిత్రలోనే ఇవి అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలుగా అభివర్ణించినట్లు కథనంలో ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత వెబ్‌సైట్లు, సర్వర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని బుధవారం హెచ్చరించింది.

భవిష్యత్తులో కృత్రిమ మేధ సాయంతో ఇలాంటి భద్రతా లోపాలను గుర్తించే అవకాశాలు మరింత పెరుగుతాయని సంస్థ అభిప్రాయపడింది.

సైబర్‌ ముప్పులను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ కంపెనీలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు

అమెరికా, జపాన్‌ సహా పలు దేశాలు అప్రమత్తం

సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం ద్వారా సైబర్‌ దాడుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

పీహెచ్‌పీ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అమెరికా, జపాన్‌తో పాటు ఐరోపా, ఆసియాలోని పలు దేశాలు అప్రమత్తమైనట్లు సమాచారం.

వెబ్‌సైట్లను వెంటనే అప్‌డేట్‌ చేయాలని, అలా చేయలేని పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఏ(NSA)హెచ్చరించినట్లు కథనం పేర్కొంది.

జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, జపాన్‌ సహా పలు దేశాల నాయకుల నుంచి కూడా ఇలాంటి హెచ్చరికలు వెలువడినట్లు తెలిపింది.

సైబర్‌ దాడుల ముప్పును నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంపై ఆయా దేశాలు దృష్టి సారించాయి.

మొత్తంగా పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడిన భద్రతా లోపాలు ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్ల నిర్వహణపై ఆందోళనకు కారణమయ్యాయి.

ADVERTISEMENT