America: అమెరికాలో విస్తరిస్తున్న బేబిసియోసిస్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
అమెరికాలో బేబిసియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) 2023 నివేదిక ప్రకారం లైమ్ తర్వాత ఈశాన్య అమెరికాలో బేబిసియోసిస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. బేబిసియోసిస్ అనేది నల్ల కాళ్ల టిక్ (పేలు) ద్వారా వ్యాపించే పరాన్నజీవి వ్యాధి. ఈ వ్యాధి బాబేసియా మైక్రోటీ అనే పరాన్నజీవి ద్వారా ఎర్ర రక్త కణాలకు సోకుతుంది. ఈ వ్యాధి మలేరియా లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. టిక్ కాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి రక్తహీనతకు కారణమవుతుంది. రక్త మార్పిడి ద్వారా లేదా సోకిన తల్లి నుండి శిశువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.
జ్వరం, చలి, శరీర నొప్పులుగా వ్యాధి లక్షణాలు
జ్వరం, చలి, వికారం, శరీర నొప్పులు, అలసట ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. కొంతమందికి హెమోలిటిక్ అనీమియా ఏర్పడవచ్చు, అంటే ఎర్ర రక్త కణాలు పరాన్నజీవుల ద్వారా నాశనం అవుతాయి. టిక్ కాటు తర్వాత కొద్ది వారాల్లో లేదా నెలల్లో ఈ లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు ఈ వ్యాధికి ప్రాణాపాయం చెందవచ్చు. సాధారణంగా బేబిసియోసిస్ స్వయంగా నయమవుతుంది.
వ్యాధిపై అవగాహన అవసరం
అయితే, పరాన్నజీవులు రక్తంలో ఉన్నప్పటికీ లక్షణాలు కనిపించని వారికీ చికిత్స అవసరం. తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్, అటోవాక్వోన్ అనే యాంటీ-పారాసిటిక్ మందులతో చికిత్స అందిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో రోగులను ఆసుపత్రిలో చేర్చి రక్త మార్పిడి వంటి చికిత్సలు అవసరం కావచ్చు. ఈ వ్యాధిపై అవగాహన అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.