LOADING...
Russia: రష్యా అకస్మాత్తుగా భారతదేశం నుండి పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తోంది?
రష్యా అకస్మాత్తుగా భారతదేశం నుండి పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తోంది?

Russia: రష్యా అకస్మాత్తుగా భారతదేశం నుండి పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా చమురు శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రష్యా విదేశాల నుంచి గ్యాసోలిన్‌ (పెట్రోల్) దిగుమతులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా భారత్ నుంచి సముద్ర మార్గం ద్వారా పెట్రోల్ కొనుగోలు ప్రారంభించినట్లు పరిశ్రమ వర్గాలు బుధవారం రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడుల ప్రభావంతో రష్యాలోని 11 టైమ్ జోన్‌ల వరకు ఇంధన కొరత విస్తరించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన రేషనింగ్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

భారత్ నుంచి రష్యాకు 60 వేల మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్

అదే సమయంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అవకాశాలపై పలు దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని క్రెమ్లిన్ మంగళవారం ప్రకటించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు భారత్ నుంచి కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్ రష్యాకు చేరింది. అలాగే ఒక్కోటి 30 వేల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యం గల రెండు ట్యాంకర్లలో ఇంధనాన్ని పంపినట్లు మరో వర్గం తెలిపింది. బెలారస్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా ప్రతి నెల మొత్తం నాలుగు లక్షల టన్నుల గ్యాసోలిన్ దిగుమతి చేసుకోవాలని రష్యా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

రష్యాలో రోజుకు కనీసం 1.10 లక్షల టన్నుల పెట్రోల్ వినియోగం

వేసవి కాలంలో రష్యాలో రోజుకు కనీసం 1.10 లక్షల టన్నుల పెట్రోల్ వినియోగం నమోదవుతుంది. ఈ సీజన్‌లో ఇంధన అవసరాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం రష్యాకు ఏ భారతీయ రిఫైనరీ నుంచి గ్యాసోలిన్ సరఫరా అవుతోందనే విషయం వెల్లడికాలేదు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల ఆయిల్ రిఫైనరీలు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. మంత్రులు, ఇతర అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.

Advertisement

వివరాలు 

జూన్ తొలి అర్ధభాగంలో అక్కడి నుంచి 70 వేల టన్నుల సరఫరా

రాయిటర్స్, పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం.. రష్యాకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న బెలారస్ కూడా రైలు మార్గం ద్వారా గ్యాసోలిన్ ఎగుమతులను గణనీయంగా పెంచింది. జూన్ తొలి అర్ధభాగంలో అక్కడి నుంచి 70 వేల టన్నుల సరఫరా జరిగింది. ఇది మే తొలి అర్ధభాగంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇంధన కొరతను అధిగమించేందుకు రష్యా పార్లమెంట్ గత వారం దేశ పన్నుల చట్టంలో కీలక సవరణలను ఆమోదించింది. ఈ మార్పుల ద్వారా భారత్ సహా విదేశాల నుంచి దిగుమతి చేసే ఇంధనంపై రవాణా వ్యయాలు, ధరలను పరిగణనలోకి తీసుకుని సబ్సిడీలు అందించే అవకాశం కల్పించింది.

Advertisement

వివరాలు 

మే నెలలో భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 36.5 శాతం

మరోవైపు ఎల్ఎస్ఈజీ, కెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. జూన్ నెలలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు పరిమాణం రికార్డు స్థాయికి చేరింది. ఇతర దేశాల నుంచి సరఫరాపై హర్మూజ్ జలసంధి పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు భారతీయ రిఫైనరీలు రష్యన్ క్రూడాయిల్ కొనుగోళ్లను మరింత పెంచినట్లు సమాచారం. కెప్లర్ గణాంకాల ప్రకారం.. మే నెలలో భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 36.5 శాతంగా ఉండగా, జూన్‌లో అది 50 శాతానికి పైగా పెరిగింది. కెప్లర్, ఎల్‌ఎస్‌ఈజీ ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్ జూన్‌లో రోజుకు సుమారు 2.70 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంది.

Advertisement