Xi Jinping: జిన్‌పింగ్‌కు ఏమైంది..? అనారోగ్యంపై వైరల్‌గా మారిన సంచలన కథనాలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. భారత్ వేదికగా ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహతప్పి పడిపోయారని.. ఆ తర్వాత అత్యవసర వైద్య చికిత్స కోసం చైనాకు తిరిగి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్, అసమ్మతి నేత వాంజున్ షీ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టుతో ఈ ప్రచారం మొదలైంది.
వివరాలు
వాంజున్ షీ ఏమన్నారంటే..
వాంజున్ షీ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు చేశారు.
బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ స్పృహ కోల్పోయారని.. దీంతో ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో చైనాకు తరలించారని పేర్కొన్నారు.
విమానాశ్రయంలో దిగిన తర్వాత జిన్‌పింగ్‌ను స్వాగతించేందుకు ఎలాంటి అధికారిక ఏర్పాట్లు చేయలేదని.. అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్‌లో నేరుగా మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తన పోస్టులో రాసుకొచ్చారు.
ప్రస్తుతం జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదని వాంజున్ పేర్కొన్నారు.
అమెరికా పర్యటనకు ముందు ఆయన కోలుకుంటారో లేదో కూడా స్పష్టత లేదని అన్నారు.
వివరాలు
అధికారిక ధ్రువీకరణ లేదు..
భారత్‌లో చికిత్స పొందితే జిన్‌పింగ్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందనే భయంతో.. ప్రాథమిక వైద్య సహాయం అందిన వెంటనే ఆయన భారత్ నుంచి బయల్దేరినట్లు ఆరోపించారు.
అయితే, వాంజున్ షీ చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
చైనా ప్రభుత్వం కానీ, భారత విదేశాంగ శాఖ కానీ ఈ ప్రచారంపై స్పందించలేదు.
దీంతో జిన్‌పింగ్ అనారోగ్యానికి సంబంధించిన వార్తల నిజానిజాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
వివరాలు
బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ కార్యక్రమాలు
బ్రిక్స్ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
అయితే, సదస్సు సందర్భంగా జరిగిన విందుకు ఆయన హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన సదస్సులో చైనా అధ్యక్షుడు ప్రసంగించారు.
అనంతరం ఆయన చైనాకు తిరిగి వెళ్లారు.
వాంజున్ షీ నేతృత్వం వహిస్తున్న చైనా డెమోక్రటిక్ పార్టీపై ఆ దేశంలో నిషేధం ఉంది. ప్రస్తుతం ఈ అసమ్మతి నేత అమెరికాలో ఉన్నట్లు సమాచారం.