Ebola: కాంగోలో అదుపు తప్పుతున్న ఎబోలా.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. భారత్‌తో పాటు అనేక దేశాలు ఇప్పటికే అప్రమత్తమై వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అయితే వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన కాంగోలో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది. వైరస్‌ను గుర్తించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు అంతర్జాతీయ సంస్థల పరిశీలనలో వెల్లడైంది. ఈశాన్య కాంగోలోని బునియా నగరంలో మే 15న తొలి ఎబోలా కేసు నమోదైంది. కానీ, దాదాపు రెండు నెలల ముందుగానే అక్కడ వైరస్ వ్యాప్తి ప్రారంభమైనట్లు సమాచారం బయటపడింది. దీంతో ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో వైరస్ వ్యాపించి ఉండొచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
అంతంతమాత్రంగానే శానిటైజర్లు, టెస్ట్ కిట్లు..
కేసులు బయటపడిన తర్వాత కూడా అక్కడ నియంత్రణ చర్యలు సరిగా అమలు కావట్లేదని తెలుస్తోంది. ఎబోలా లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా వేరు చేసి చికిత్స అందించడం, వైద్య సిబ్బంది రక్షణ దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు చాలా చోట్ల కనిపించట్లేదని నివేదికలు చెబుతున్నాయి. ఇక, శానిటైజర్లు, టెస్ట్ కిట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జనరేటర్లకు అవసరమైన ఇంధనం కొరత కారణంగా రోజుకు కేవలం 20 నుంచి 40 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగోకు ఇచ్చే ఆర్థిక సాయం భారీగా తగ్గింది.
వివరాలు
1976లో తొలిసారి ఎబోలా వైరస్
దీంతో ఆ దేశం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ సహాయ సంస్థలకూ నిధుల కొరత ఏర్పడటంతో వైరస్ నియంత్రణకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. 1976లో తొలిసారి ఎబోలా వైరస్ గుర్తించిన తర్వాత కాంగోలో ఇది 17వసారి వ్యాపిస్తోంది. అయితే ఈసారి బయటపడిన బుండిబుగ్యో రకం మరింత ప్రమాదకరంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 900 కేసులు నమోదయ్యాయని, మరణాల శాతం 40 వరకు ఉందని కాంగో అధికారులు వెల్లడించారు. అయితే మరణాల సంఖ్యపై పూర్తి అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
వివరాలు
బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం
ఇక ఎబోలా బాధితుల మృతదేహాల నిర్వహణ కూడా కొత్త సమస్యలకు దారితీస్తోంది. వైరస్ వ్యాప్తి భయంతో అధికారులు ప్రత్యేక జాగ్రత్తల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా అంత్యక్రియలు జరుగుతున్నాయంటూ స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు ఎబోలా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిపై దాడి చేసి ఇద్దరి మృతదేహాలను తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.