Zelensky: రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్స్కీ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా చరిత్రలో తప్పుడు పక్షం వైపు నిలిచిందని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు చెందిన 'పియర్స్ మోర్గాన్ అన్సెన్సార్డ్' కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించడంతో పాటు సరఫరాను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
ట్రంప్‌ను సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు: జెలెన్స్కీ
"ట్రంప్ మమ్మల్ని కాకుండా మరో పక్షాన్ని ఎంచుకోవడం బాధాకరం. కనీసం తటస్థంగా అయినా ఉండాలి కానీ, తప్పుడు పక్షం వైపు నిలవకూడదు" అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
ట్రంప్‌కు ఆయన సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ నిర్ణయం చరిత్రలో సరైనదిగా నిలవదని అభిప్రాయపడ్డారు.
అమెరికా వంటి బలమైన భాగస్వామిని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
వివరాలు
ఇంధన కాల్పుల విరమణకు మద్దతిచ్చినా రష్యా దాడులు ఆగలేదు
అక్టోబర్ 11న ట్రంప్ ప్రకటించిన 'ఇంధన కాల్పుల విరమణ' ప్రతిపాదనపైనా జెలెన్స్కీ స్పందించారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపామని చెప్పారు.
ఇందులో భాగంగా కొన్ని రోజుల పాటు రష్యా ఇంధన లక్ష్యాలపై దాడులు చేయకుండా ఉన్నామని వెల్లడించారు.
అయితే, ఉక్రెయిన్ మాత్రం ఈ విషయంలో సంయమనం పాటించినప్పటికీ రష్యా తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగించిందని జెలెన్స్కీ ఆరోపించారు.
బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడులు జరిపిందని పేర్కొన్నారు.
ఈ దాడుల కారణంగా కనీసం 6 లక్షల మంది ప్రజలు విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.