2026 Ducati Multistrada V4 Rally: కొత్త డుకాటి మల్టిస్ట్రాడా V4 ర్యాలీ భారత్‌లో లాంచ్.. అదిరిపోయేలా ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్లో 2026 మల్టిస్ట్రాడా V4 ర్యాలీ బైక్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డుకాటి డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌కు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇది డుకాటి రెడ్, జేడ్ గ్రీన్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. డుకాటి రెడ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.32.40లక్షలు కాగా,జేడ్ గ్రీన్ వేరియంట్ ధర రూ.32.73 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ బైక్‌లో 1.2లీటర్ డుకాటి V4 గ్రాంటూరిస్మో ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 170 హెచ్‌పీ శక్తిని,123 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ వేగాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు రియర్ సిలిండర్ బ్యాంక్ డీయాక్టివేషన్ వ్యవస్థను కంపెనీ మరింత మెరుగుపరిచింది.
వివరాలు
ముందు, వెనుక భాగాల్లో 200 మిల్లీమీటర్ల సస్పెన్షన్ ట్రావెల్
అలాగే మోటోజీపీ స్ఫూర్తితో రూపొందించిన కౌంటర్ రొటేటింగ్ క్రాంక్‌షాఫ్ట్‌ను కొనసాగించడం వల్ల బైక్ నియంత్రణ, మలుపుల్లో స్థిరత్వం మరింత మెరుగవుతుందని డుకాటి తెలిపింది. 2026 మల్టిస్ట్రాడా V4 ర్యాలీలో అప్‌గ్రేడ్ చేసిన స్కైహుక్ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. ముందు, వెనుక భాగాల్లో 200 మిల్లీమీటర్ల సస్పెన్షన్ ట్రావెల్ లభిస్తుంది. ప్రయాణంలోనే డ్యాంపింగ్ సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఉంది. కొత్తగా ఇచ్చిన ఆటో మోడ్ రైడింగ్ శైలి, రోడ్డు పరిస్థితులను గుర్తించి సస్పెన్షన్‌ను స్వయంగా సర్దుబాటు చేస్తుంది. 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక తేలికైన స్పోక్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ పిరెల్లీ స్కార్పియన్ ట్రెయిల్ II టైర్లను అమర్చారు.
వివరాలు
మూడు పవర్ మోడ్‌లు
ఈ బైక్‌లో 6.5 అంగుళాల టీఎఫ్‌టీఈ డిస్‌ప్లేను అందించారు. దీని ద్వారా అన్ని ఎలక్ట్రానిక్ రైడింగ్ ఫీచర్లను నియంత్రించవచ్చు. ఇందులో మూడు పవర్ మోడ్‌లు, స్పోర్ట్, టూరింగ్, వెట్, అర్బన్, ఎండ్యూరో అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్‌తో పాటు కొత్తగా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఇది ముందు, వెనుక చక్రాలకు బ్రేకింగ్ శక్తిని సమతుల్యంగా పంపిణీ చేసి మరింత స్థిరత్వాన్ని కల్పిస్తుంది.
వివరాలు
కోత్తగా ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఫీచర్
2026 మల్టిస్ట్రాడా V4 ర్యాలీలోని అన్ని ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ వ్యవస్థలను వెహికల్ అబ్జర్వర్ సిస్టమ్ నిర్వహిస్తుంది. మోటార్‌సైకిల్‌లోని పలు సెన్సర్ల నుంచి సమాచారాన్ని సేకరించి కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా వ్యవస్థలను రియల్‌టైమ్‌లో పనిచేసేలా చేస్తుంది. ఇప్పటికే ఉన్న ముందు, వెనుక రాడార్ వ్యవస్థతో పాటు ఈసారి కొత్తగా ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఫీచర్‌ను కూడా జోడించారు. ముందున్న అడ్డంకులను గుర్తించి రైడర్‌ను ముందుగానే హెచ్చరించే ఈ ఫీచర్ ప్రయాణ భద్రతను మరింత పెంచుతుంది.