2026 F1 Australian Grand Prix: మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్.. భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఫార్ములా-1 సీజన్ మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌తో ప్రారంభం కానుంది. ఈసారి ఎఫ్1 చరిత్రలో పెద్ద మార్పులకు నాంది పలుకుతున్న సీజన్‌గా భావిస్తున్నారు. కొత్త నిబంధనలతో కార్లు మరింత వేగంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు రేసులు కూడా మరింత ఉత్కంఠగా మారనున్నాయి. కొత్త తరహా కార్లు పెట్రోల్ పవర్‌తో పాటు ఎలక్ట్రిక్ శక్తిని సమతుల్యంగా ఉపయోగించే హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోటార్ సామర్థ్యాన్ని భారీగా పెంచి 120 కిలోవాట్ల నుంచి 350 కిలోవాట్లకు, అంటే సుమారు 470 హార్స్‌పవర్ వరకు పెంచారు. దీంతో కార్లు మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశముంది. అదే సమయంలో వివాదాస్పదంగా ఉన్న MGU-H హీట్ రికవరీ యూనిట్‌ను పూర్తిగా తొలగించారు.
వివరాలు
ఎఫ్1లోకి 11వ జట్టుగా కాడిలాక్
దీంతో పవర్ యూనిట్ వ్యవస్థ సులభతరం కావడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జట్లలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కాడిలాక్ 11వ జట్టుగా ఎఫ్1లోకి అడుగుపెడుతూ వాల్తెరి బొట్టాస్,సెర్జియో పెరెజ్‌లను డ్రైవర్లుగా తీసుకుంది. ఫెరారీ ఇంజిన్లతో ఈ జట్టు తొలి సీజన్‌లో పోటీ పడనుంది. 2004 తర్వాత ఫోర్డ్ సంస్థ మళ్లీ ఎఫ్1లోకి రీ-ఎంట్రీ ఇస్తూ రెడ్ బుల్ రేసింగ్‌తో కలిసి కొత్త పవర్ యూనిట్ అభివృద్ధి చేస్తోంది. హోండా మాత్రం రెడ్ బుల్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించుకుని ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ జట్టుతో అధికారికంగా కలిసింది. అల్పైన్ జట్టు కూడా తన రెనాల్ట్ ఇంజిన్లను వదిలి మెర్సిడెస్ నుంచి కస్టమర్ పవర్ యూనిట్‌ను ఉపయోగించనుంది.
వివరాలు
మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ రేస్
ఇక ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ రేస్ వీకెండ్ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 6న శుక్రవారం ఉదయం 7 గంటలకు ఫ్రీ ప్రాక్టీస్-1,ఉదయం 10:30కు ఫ్రీ ప్రాక్టీస్-2 సెషన్లు జరుగుతాయి. మార్చి 7న శనివారం ఉదయం 7 గంటలకు ఫ్రీ ప్రాక్టీస్-3 జరుగగా, ఉదయం 10:30కు క్వాలిఫైయింగ్ సెషన్ జరుగుతుంది. ఇందులో డ్రైవర్లు గ్రిడ్ పొజిషన్ కోసం పోటీ పడతారు.ఇక ప్రధాన రేస్ మార్చి 8న ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత అభిమానులు ఈ రేస్‌ను FanCode యాప్, వెబ్‌సైట్,స్మార్ట్ డివైసెస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. అలాగే ఆపిల్ వినియోగదారులు తమ డివైసుల్లో F1 TV Pro ద్వారా కూడా రేస్‌ను లైవ్‌గా చూడొచ్చు.