2026 Mini Countryman C: జూన్ 17న భారత్‌లోకి 2026 మినీ కంట్రీమ్యాన్ C.. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ, 2026 కంట్రీమ్యాన్ C ఎస్‌యూవీని భారత మార్కెట్లో జూన్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ భారతీయ శ్రేణిలో ఉన్న అధిక పనితీరు గల కంట్రీమ్యాన్ JCW ఆల్4 కంటే తక్కువ ధరలో ఈ కొత్త వేరియంట్ అందుబాటులోకి రానుంది. వాహనం కోసం ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2026 మినీ కంట్రీమ్యాన్ C స్థానికంగానే అసెంబుల్ చేయబడనుండటంతో, భారత మార్కెట్లో పోటీ ధరలో అందించే అవకాశం ఉంది. మినీ బ్రాండ్‌కు ప్రత్యేకమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లను కొనసాగిస్తూ మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను తీసుకొస్తోంది.
వివరాలు
అందుబాటులో ఐదు రంగులు
ఈ ఎస్‌యూవీ చిల్లీ రెడ్,బ్రిటిష్ రేసింగ్ గ్రీన్,నానుక్ వైట్, స్లేట్ బ్లూ, స్మోకీ గ్రీన్ వంటి ఐదు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్‌ను పోలి ఉన్నప్పటికీ, గ్రిల్, బంపర్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVM హౌసింగ్స్, బ్లాక్ రూఫ్, డోర్ పిల్లర్స్, షాంపేన్ కలర్ ఎక్స్‌టీరియర్ ట్రిమ్స్, అల్లాయ్ వీల్స్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ఆకర్షణీయ అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్‌తో పాటు షాంపేన్ కలర్ ట్రిమ్స్, మినీకి ప్రత్యేకమైన వృత్తాకార టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
వివరాలు
బీఎండబ్ల్యూ X1లో ఉపయోగిస్తున్న మూడు సిలిండర్ల ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే,1.5లీటర్ టర్బో పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయనున్నారు. అధికారిక పవర్ గణాంకాలను మినీ ఇండియా ఇంకా వెల్లడించలేదు.అయితే ఇదే మూడు సిలిండర్ల ఇంజిన్ బీఎండబ్ల్యూ X1లో ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌లో ఇది 136హెచ్‌పీ శక్తి, 230ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.మరోవైపు కంట్రీమ్యాన్ JCW ఆల్4లోని 2.0లీటర్ టర్బో ఇంజిన్ 300హెచ్‌పీ శక్తి, 400ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. ధర పరంగా చూస్తే,ప్రస్తుతం రూ.64.9లక్షల (ఎక్స్‌షోరూమ్) ధర కలిగిన కంట్రీమ్యాన్ JCW ఆల్4 కంటే ఈ కొత్త కంట్రీమ్యాన్ C తక్కువ ధరలో రానుంది. భారత మార్కెట్లో ఇది బీఎండబ్ల్యూ X1, ఆడి Q3, మెర్సిడెస్-బెంజ్ GLA వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీగా నిలవనుంది.