Renault Duster : మూడు ఇంజిన్ ఆప్షన్లతో కొత్త డస్టర్.. మార్చ్ 17న మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా రాబోతున్న 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి బలంగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. విభిన్న కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను మూడు ఇంజిన్ ఎంపికలతో కంపెనీ ప్రవేశపెడుతోంది. మొదటి ఆప్షన్‌గా 1.8 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో పనిచేసే ఈ వేరియంట్ గరిష్టంగా 160 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు,ఇంధన సామర్థ్యాన్ని సమతుల్యం చేసే విధంగా ఈ ఇంజిన్ రూపొందించబడింది.
వివరాలు
మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ఈ వేరియంట్
ఇక 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరో ముఖ్యమైన ఎంపిక. ఇది 163 బీహెచ్‌పీ శక్తితో పాటు 280 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతుంది. మూడోగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను బేస్ వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 100 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా గ్లోబల్ మోడల్‌ను అనుసరించినప్పటికీ, భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.
వివరాలు
కంఫర్ట్,లగ్జరీపై ప్రత్యేక శ్రద్ధ
ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు వాహనానికి ఆకర్షణీయమైన ముందుభాగ రూపాన్ని ఇస్తాయి. కొత్త డస్టర్ బ్యాడ్జ్‌తో గ్రిల్ డిజైన్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. సిల్వర్ హైలైట్స్‌తో కూడిన బంపర్, పిక్సెల్ ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ వాహనానికి రగ్గడ్ లుక్‌ను అందిస్తున్నాయి. లోపలి భాగంలో కంఫర్ట్,లగ్జరీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది. ప్రీమియం ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ టెయిల్‌గేట్, 6-వే అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.
వివరాలు
అత్యాధునిక సదుపాయాలతో ఎస్‌యూవీ
భద్రతా పరంగా కూడా ఈ ఎస్‌యూవీ అత్యాధునిక సదుపాయాలతో వస్తోంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైరుప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)తో పాటు లెవల్ 2 ADAS టెక్నాలజీని కూడా అందిస్తున్నారు. కొత్త డస్టర్ కోసం రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టర్బో పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్‌లో మొదలుకానున్నాయి. అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు దీపావళి 2026 నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ ధరలను కంపెనీ లాంచ్ సమయాన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.