Loading...
Royal Enfield Bear 650: రూ.3.4 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. కొనాలా వద్దా?
రూ.3.4 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. కొనాలా వద్దా?

Royal Enfield Bear 650: రూ.3.4 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. కొనాలా వద్దా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బేర్ 650 (Royal Enfield Bear 650) బైక్‌ను ఎడారి రేసింగ్‌లోని సాహసం, పట్టుదలకు స్ఫూర్తిగా రూపొందించినట్లు చెబుతోంది. అయితే భారత రహదారులపై ఈ బైక్‌ను ఉపయోగించే విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది. మన దేశంలో ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారిలో చాలామంది ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించకపోవచ్చు. నగరాల్లో గుంతలను తప్పించుకుంటూ ఎత్తుపల్లాలున్న స్పీడ్ బ్రేకర్లను దాటుకుంటూ, రద్దీ ట్రాఫిక్‌లో ముందుకు సాగుతూ, అప్పుడప్పుడు ఆదివారం ఉదయం లాంగ్ రైడ్లకు వెళ్లేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు.

వివరాలు

రోజువారీ ప్రయాణిలకు అనుకూలం

దాదాపు మూడు నెలల పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 బైక్‌ను రోజువారీ ప్రయాణాలకు ఉపయోగించిన ఓ లాంగ్ టర్మ్ రివ్యూ ఆధారంగా.. ఈ మోటార్‌సైకిల్ పనితీరు, సౌకర్యం, లోపాలు, ప్రత్యేకతలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ బైక్‌లలో కొనుగోలుదారులకు అత్యంత ఉపయోగకరమైన ఎంపిక ఇదేనా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం 'కాదు' అనే చెప్పాలి.

ఎందుకంటే ఇదే కంపెనీ షోరూమ్‌లలో దీనికంటే ఆచరణాత్మకమైన ఇతర మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, బేర్ 650 ప్రత్యేకతే దీనిని ఇష్టపడేలా చేస్తుంది.

వివరాలు

ధర, అవసరాల పరంగా చూస్తే ఇతర బైక్‌లదే పైచేయి!

బైక్ కొనుగోలు చేసే సమయంలో ధర, పనితీరు, సౌకర్యం, వినియోగం వంటి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 తన ప్రత్యేకతను నిరూపించుకోవడం కొంత కష్టమే.

ఎందుకంటే కంపెనీ లైనప్‌లో వివిధ అవసరాలకు సరిపోయే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సుదూర ప్రయాణాల్లో మెరుగైన సౌకర్యం కావాలనుకునేవారికి క్లాసిక్ 650 మంచి ఎంపిక.

టూరింగ్‌తో పాటు ఆఫ్‌రోడింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి హిమాలయన్ 450 అందుబాటులో ఉంది. ధరకు తగ్గ విలువ, పనితీరు కోరుకునేవారికి ఇంటర్‌సెప్టర్ 650 ఆకర్షణీయంగా ఉంటుంది.

పూర్తిగా ప్రత్యేకమైన డిజైన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి షాట్‌గన్ 650 కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

అత్యంత చౌకైన ట్విన్ సిలిండర్ మోడల్ కాదు

ఈ నేపథ్యంలో బేర్ 650 ఈ మోడళ్ల మధ్య ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది.

ఇది పూర్తిస్థాయి ఆఫ్‌రోడ్ బైక్ కాదు. హైవేలపై ప్రశాంతంగా ప్రయాణించేందుకు రూపొందించిన క్రూయిజర్ కూడా కాదు.

అంతేకాకుండా, సుమారు రూ.3.4 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో లభించే ఈ బైక్ అత్యంత చౌకైన ట్విన్ సిలిండర్ మోడల్ కూడా కాదు.

అయితే సాధారణ మోటార్‌సైకిళ్లకు భిన్నంగా కనిపించే స్క్రాంబ్లర్ డిజైన్, రగ్గడ్ లుక్, ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతి దీని ప్రధాన ఆకర్షణలు.

ADVERTISEMENT

వివరాలు

648 సీసీ ఇంజిన్.. తెలిసిన పనితీరుకు కొత్త రూపం

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650లో కంపెనీకి చెందిన 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఇదే ఇంజిన్‌ను ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650 మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు.

ఈ ఇంజిన్ గరిష్ఠంగా 47 హెచ్‌పీ పవర్, 56.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

అలాగే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ను అందించారు. ఇంజిన్ పనితీరు ఇప్పటికే నిరూపితమైనదే అయినప్పటికీ, అదే ఇంజిన్‌కు మరింత కఠినమైన, ఎక్కడికైనా వెళ్లగలిగే బైక్ అనే రూపాన్ని ఇవ్వడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ విజయవంతమైంది.

వివరాలు

రగ్గడ్ డిజైన్ ప్రత్యేక గుర్తింపు

రెట్రో స్టైలింగ్‌తో పాటు రగ్గడ్ డిజైన్ ఈ బైక్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తాయి. బేర్ 650 సీటు ఎత్తు 830 మిల్లీమీటర్లు.

ఇది సగటు ఎత్తు ఉన్న చాలామంది రైడర్లకు నిర్వహించగలిగే స్థాయిలో ఉంటుంది.

ఇక 184 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల తారు రోడ్లు ముగిసిన చోట లేదా రహదారుల నాణ్యత బాగా తగ్గిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కొంత అదనపు విశ్వాసం లభిస్తుంది.

ముఖ్యంగా గుంతలు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండే భారత రహదారులపై ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉపయోగపడుతుంది.

వివరాలు

210 కిలోలకుపైగా బరువు

కొద్దిసేపు బైక్ నడిపినప్పుడు కనిపించని కొన్ని లోపాలు, ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు స్పష్టంగా బయటపడతాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.

ఈ బైక్ బరువు 210 కిలోలకుపైగా ఉంటుంది. ప్రయాణంలో వేగం పెరిగినప్పుడు ఆ బరువును కొంతవరకు సులభంగా నిర్వహించగలిగినా.. నగరాల్లోని ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసేటప్పుడు, తక్కువ వేగంతో యూటర్న్ తీసుకునేటప్పుడు మాత్రం బరువు స్పష్టంగా అనిపిస్తుంది.

రద్దీ ట్రాఫిక్‌లో తరచూ ఆపుతూ, ముందుకు కదులుతూ ప్రయాణించేవారికి ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు. సస్పెన్షన్ సెటప్ కూడా ఈ బైక్‌లోని ప్రధాన లోపాల్లో ఒకటి.

దీని సస్పెన్షన్ చాలా గట్టిగా ఉంటుందని దీర్ఘకాలిక రివ్యూలో పేర్కొన్నారు.

వివరాలు

హ్యాండిల్‌బార్ రైడింగ్ పొజిషన్ ఎలా ఉంది?

గుంతలు, పాడైన రోడ్లపై ప్రయాణించేటప్పుడు రహదారిపై ఉన్న అసమానతల ప్రభావం నేరుగా రైడర్‌కు తెలుస్తుంది. దీంతో రోజువారీ ప్రయాణాల్లో ఆశించినంత సౌకర్యం లభించకపోవచ్చు.

బేర్ 650లో వెడల్పైన హ్యాండిల్‌బార్లు, నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్‌ను అందించారు. తక్కువ దూరాలకు ప్రయాణించేటప్పుడు ఈ సెటప్ సహజంగానే అనిపిస్తుంది.

అయితే మూడు నెలల పాటు బైక్‌ను ఉపయోగించిన అనుభవం ఆధారంగా హ్యాండిల్‌బార్ రైజర్లను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని రివ్యూలో అభిప్రాయపడ్డారు.

హ్యాండిల్‌బార్లను ఒకటి లేదా రెండు అంగుళాలు పైకి ఎత్తడం వల్ల రైడర్ చేతులపై పడే ఒత్తిడి తగ్గి, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, సుదీర్ఘ కమ్యూటింగ్ చేసే వారికి ఈ మార్పు ఉపయోగపడవచ్చు.

వివరాలు

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ప్రత్యేకత

టెక్నాలజీ పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650లో రౌండ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు.

ఇందులో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఉండటం నగరాల్లో కొత్త మార్గాల్లో ప్రయాణించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

దీనితో పాటు రైడింగ్ మోడ్‌లు, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందించారు. అయితే ఈ ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ బైక్ నడిపే సమయంలో యాంత్రిక అనుభూతి ప్రధానంగా ఉంటుంది.

ఎలక్ట్రానిక్ వ్యవస్థల జోక్యం తక్కువగా ఉండటం కొందరు రైడర్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా అనిపించవచ్చు.

మరికొందరికి మాత్రం మరిన్ని ఆధునిక ఎలక్ట్రానిక్ సహాయక ఫీచర్లు లేకపోవడం లోపంగా కనిపించవచ్చు.

వివరాలు

బేర్ 650 కొనడం ఎంతవరకు సరైన నిర్ణయం?

సాధారణంగా బైక్ రివ్యూల్లో ఏ మోడల్ అత్యుత్తమమైనదనే ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటారు.

కానీ మోటార్‌సైకిల్ ప్రియులు కేవలం ధర, ఫీచర్లు, సాంకేతిక వివరాలను చూసి మాత్రమే బైక్‌లను కొనుగోలు చేయరు.

తమకు నచ్చిన డిజైన్, రైడింగ్ అనుభూతి, బైక్‌తో ఏర్పడే అనుబంధానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. రోజువారీ ప్రయాణాల కోసం 648 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ తప్పనిసరిగా అవసరం లేదు.

స్పోక్ వీల్స్ లేదా స్క్రాంబ్లర్ డిజైన్ కూడా ప్రతి ఒక్కరికీ అవసరమైన ఫీచర్లు కావు. అయినప్పటికీ, బేర్ 650ను ఎంచుకోవడానికి ఇవే కారణాలుగా మారవచ్చు.

ఈ బైక్‌ను ఉపయోగించిన రివ్యూయర్ అభిప్రాయం ప్రకారం.. గ్యారేజీలోని ఇతర బైక్‌లతో పోలిస్తే తరచూ బేర్ 650నే నడపాలనిపించేది.

వివరాలు

సాంకేతిక వివరాలతో కొలవలేం

ఎందుకంటే ఈ బైక్ తన పనితీరుతో మాత్రమే ఆకట్టుకోదు. సాధారణంగా వెళ్లే మార్గాన్ని వదిలి మరో మార్గంలో ప్రయాణించాలనే ఆసక్తిని కలిగిస్తుంది.

దారిలో కనిపించే మట్టి రహదారిని ప్రయత్నించాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి రైడింగ్ అనుభూతిని కేవలం సాంకేతిక వివరాలతో కొలవలేమని రివ్యూలో పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ మోడళ్లలో అత్యంత ఆచరణాత్మకమైన ఎంపికగా ఇంటర్‌సెప్టర్ 650 నిలుస్తుంది.

కానీ బేర్ 650ను రూపొందించిన ఉద్దేశం కేవలం ఆచరణాత్మక అవసరాలను తీర్చడం మాత్రమే కాదు. హృదయానికి నచ్చిన బైక్‌ను ఎంచుకుని, ఆ తర్వాత దానికి కారణాలను వెతుక్కునే రైడర్ల కోసం ఈ మోడల్‌ను రూపొందించారు.

ADVERTISEMENT