LOADING...
Alpine's Crocodile-Themed A290 EV: ఆల్పైన్-లాకోస్ట్ కొత్త కాన్సెప్ట్ కారు డిజైన్ వైరల్
A290 EV: ఆల్పైన్-లాకోస్ట్ కొత్త కాన్సెప్ట్ కారు డిజైన్ వైరల్

Alpine's Crocodile-Themed A290 EV: ఆల్పైన్-లాకోస్ట్ కొత్త కాన్సెప్ట్ కారు డిజైన్ వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పెర్ఫార్మెన్స్ కార్ల తయారీ సంస్థ ఆల్పైన్ (Alpine), ప్రముఖ దుస్తుల బ్రాండ్ లాకోస్ట్ (Lacoste)తో కలిసి తన A290 ఎలక్ట్రిక్ హాట్ హ్యాచ్కు ప్రత్యేకంగా ఒకే ఒక్క మోడల్‌ను రూపొందించింది. "Beware of the Crocodile" పేరుతో రూపొందించిన ఈ కారు వినూత్న డిజైన్‌తో ఆటోమొబైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ కారులో అత్యంత ప్రత్యేక ఆకర్షణ బానెట్‌పైనే కనిపిస్తుంది. బానెట్‌ను ఎర్రటి నీటి కొలనులా తీర్చిదిద్దగా, అందులో ఈదుతున్న మూడు మొసళ్ల ఆకృతులను రూపొందించారు. వెనుక భాగంలోని స్పాయిలర్‌పై పారదర్శకంగా కనిపించే పెద్ద మొసలి డిజైన్‌ను కూడా అమర్చారు. దీంతో ఈ కారు చూసిన వెంటనే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు.

వివరాలు 

పూర్తిగా కొత్త బంపర్లు

A290 Rallye ప్రత్యేక ఎడిషన్‌కు మ్యాట్ నీలిరంగు కలిసిన తెలుపు (Matte Bluish White) పెయింట్ ఫినిష్ ఇచ్చారు. తెల్లటి ఏరోడిస్క్ వీల్స్ ఈ కారుకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. ఈ మోడల్‌లో ముందు, వెనుక బంపర్లను పూర్తిగా కొత్తగా రూపొందించారు. ముందు భాగంలో తెల్లటి ప్యానెల్‌పై లాకోస్ట్ బ్రాండింగ్‌ను ఎంబాస్ కాకుండా లోపలికి ముద్రించిన (Debossed) శైలిలో తీర్చిదిద్దారు. దీని చుట్టూ ఫోర్జ్డ్ కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో పాటు పవర్‌ట్రెయిన్‌ను చల్లబరిచే వెంట్స్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో కూడా భారీ తెల్లటి డిఫ్యూజర్‌ను ఫోర్జ్డ్ కార్బన్ ఫైబర్ హౌసింగ్‌లో అమర్చారు. అలాగే పెద్ద రియర్ స్పాయిలర్ కారుకు స్పోర్టీ లుక్‌ను అందిస్తోంది.

వివరాలు 

హెడ్‌లైట్ల స్థానంలో ప్రత్యేక ప్యానెల్స్

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో సాధారణ హెడ్‌లైట్ల స్థానంలో బాడీ కలర్ ప్యానెల్స్‌ను అమర్చారు. వాటి మధ్యలో ఒకే ఒక్క ఎర్రటి LED లైట్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా ర్యాలీ లైట్లపై ఆల్పైన్, లాకోస్ట్ లోగోలను పొందుపరిచారు. వెనుక టెయిల్ లైట్లు కూడా ఇదే తరహా బాడీ కలర్ ఫినిష్‌తో పాటు సన్నని నిలువు ఎర్రటి LED లైటింగ్‌ను కలిగి ఉన్నాయి.

Advertisement

వివరాలు 

మొసలి నోటిలోకి అడుగుపెట్టిన అనుభూతి

ఈ కారులోని ఇంటీరియర్ మొత్తం ఎరుపు రంగులో రూపొందించారు. డ్రైవర్ కారులో కూర్చుంటే మొసలి నోటిలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. డోర్లపై Alpine x Lacoste లోగోలను అమర్చగా, రేసింగ్ బకెట్ సీట్లకు 3డీ ప్రింటెడ్ లాటీస్ డిజైన్ ఇచ్చారు. సీట్ల కుషన్లు, డోర్ ప్యానెల్స్ కోసం లాకోస్ట్ తన దుస్తుల్లో ఉపయోగించే ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను వినియోగించింది. స్టీరింగ్ వీల్‌ను కూడా అదే ఫ్యాబ్రిక్‌తో రూపొందించి, 12 గంటల స్థానంలో ఆకుపచ్చ రంగు స్ట్రిప్‌ను జోడించారు. డ్యాష్‌బోర్డ్‌పై లాకోస్ట్‌కు గుర్తింపుగా నిలిచే మొసలి లోగో ప్యాచ్‌ను అమర్చి ఈ ప్రత్యేక ఎడిషన్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు.

Advertisement