Loading...
Maruti Suzuki: మారుతీ కార్లకు మరోసారి షాక్‌.. రూ.20 వేల వరకు ధరల పెంపు!
మారుతీ కార్లకు మరోసారి షాక్‌.. రూ.20 వేల వరకు ధరల పెంపు!

Maruti Suzuki: మారుతీ కార్లకు మరోసారి షాక్‌.. రూ.20 వేల వరకు ధరల పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల ధరలను గరిష్ఠంగా రూ.20,000 వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మే తర్వాత మారుతి సుజుకి ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఏర్పడుతున్న ఒత్తిళ్లే తాజా ధరల పెంపునకు ప్రధాన కారణాలని కంపెనీ తెలిపింది. అయితే గతంలో మాదిరిగా తన మొత్తం కార్ల శ్రేణిపై ఈసారి ధరల పెంపు ఉండదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపైనే ఈ పెంపు ప్రభావం ఉంటుందని పేర్కొంది.

వివరాలు

ఖర్చులు తగ్గించేందుకు చర్యలు

పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని వినియోగదారులపై సాధ్యమైనంత తక్కువగా పడేలా చేయడానికి మారుతి సుజుకి ఇప్పటికే పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతోంది.

ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు కంపెనీ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

అయితే ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉండటం, ఉత్పత్తి వ్యయాల పరిస్థితి ప్రతికూలంగా కొనసాగుతుండటంతో.. పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని మారుతి సుజుకి వెల్లడించింది.

అదే సమయంలో కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

వివరాలు

మారుతి కార్లలో ఏ మోడళ్లపై ప్రభావం?

మారుతి సుజుకి తన వాహనాలను ప్రధానంగా అరేనా, నెక్సా శ్రేణుల కింద విక్రయిస్తోంది.

అరేనా రేంజ్‌లో ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్‌ఆర్‌, ఈకో, స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజ్జా, ఎర్టిగా, విక్టోరిస్‌ వంటి మోడళ్లు ఉన్నాయి.

అదే విధంగా నెక్సా శ్రేణిలో eVITARA, ఇన్విక్టో, జిమ్నీ, XL6, గ్రాండ్‌ విటారా, FRONX, బాలెనో వంటి మోడళ్లు ఉన్నాయి.

అయితే తాజాగా ప్రకటించిన ధరల పెంపు ఏయే నిర్దిష్ట మోడళ్లకు వర్తిస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఆయా మోడళ్లకు సంబంధించిన వివరాలను మారుతి సుజుకి ప్రకటించే అవకాశం ఉంది.

ADVERTISEMENT