Aprilia: భారత్‌లో ఏప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్లో 2026 టువోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టువోనో 457 మోడల్‌కు ఇది అప్‌డేటెడ్ వెర్షన్ కాగా, పెద్ద ఎత్తున యాంత్రిక మార్పులు చేయకుండా రైడర్ సౌకర్యం,ఎర్గోనామిక్స్, రోజువారీ వినియోగం, టూరింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేలా పలు కొత్త ఫీచర్లను జోడించింది. 2006లో విడుదలైన టువోనో 1000ఆర్ మోడల్ నుంచి స్ఫూర్తి పొందిన ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ మాంబా బ్లాక్,ప్యూమా గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. హైవే ప్రయాణాల్లో గాలి ఒత్తిడిని తగ్గించేందుకు కొత్త టింటెడ్ ఫ్లైస్క్రీన్‌ను అమర్చారు.
వివరాలు
కొత్త మోడల్‌లో రైడర్ సౌకర్యంపై ప్రత్యేక దృష్టి
ఇది రైడర్ అలసటను తగ్గించడంలో సహాయపడుతూనే బైక్ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను కొనసాగించేలా రూపొందించారు. ఈ కొత్త మోడల్‌లో రైడర్ సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హ్యాండిల్‌బార్‌ను కొంత ఎత్తుగా అమర్చడం వల్ల రైడర్ మరింత నిటారుగా కూర్చునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా చేతులు, భుజాలు, నడుముపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే హై-రెసిలియన్స్ ఫోమ్‌తో రూపొందించిన కొత్త సీటు ఎక్కువ మద్దతు అందించడంతో పాటు వైబ్రేషన్లను కూడా తగ్గిస్తుంది. రహదారులపై మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సస్పెన్షన్ సెటప్‌ను కూడా సవరించారు. గుంతలు,ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణించినప్పుడు మెరుగైన రైడ్ క్వాలిటీ అందేలా సాఫ్ట్ ట్యూనింగ్ చేశారు.
వివరాలు
ముందు, వెనుక భాగాల్లో ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం
ముందు, వెనుక భాగాల్లో ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం కొనసాగుతోంది. అదనంగా అడ్జస్టబుల్ బ్రేక్ లీవర్‌ను అందించడం ద్వారా రైడర్లు తమ చేతి పరిమాణం, డ్రైవింగ్ శైలికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంజిన్ విషయానికి వస్తే,టువోనో 457 స్పెషల్ ఎడిషన్‌లో అదే 457 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 47.6 హెచ్‌పీ శక్తితో పాటు 43.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో ఫుల్ కలర్ టీఎఫ్‌టీఎఫ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది CAN ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థతో అనుసంధానమై సెల్ఫ్ డయాగ్నస్టిక్స్, ల్యాప్ టైమింగ్ వంటి ఆధునిక ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. అన్ని లైటింగ్ యూనిట్లు ఎల్ఈడీ సాంకేతికతతో అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
మోటార్‌సైకిల్‌పై నాలుగేళ్లు లేదా 48,000 కిలోమీటర్ల వారంటీ
టువోనో 457 స్పెషల్ ఎడిషన్‌తో పాటు పలు యాక్సెసరీలను కూడా ఏప్రిలియా అందిస్తోంది. వీటిలో క్విక్ షిఫ్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, ఫోర్క్ స్లైడర్లు, ప్యాసింజర్ సీట్ కవర్, షార్ట్ మడ్‌గార్డ్, వెహికల్ కవర్ వంటి వాటికి అవకాశం ఉంది. అదనంగా ఈ మోటార్‌సైకిల్‌పై నాలుగేళ్లు లేదా 48,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.