BS6 PUC Certificate: బీఎస్-6 కార్లు, బైక్‌లకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల వరకు నో పీయూసీ టెన్సన్
ఈ వార్తాకథనం ఏంటి
వాహనం కొనుగోలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పొల్యూషన్ సర్టిఫికెట్ కోసం వెళ్లడం చాలామంది వాహనదారులకు సాధారణంగా మారిపోయింది. ఇకపై బీఎస్-6 వ్యక్తిగత వాహనాలు కలిగిన వారికి ఈ ఇబ్బంది కొంతవరకు తగ్గనుంది. పీయూసీ (PUC) సర్టిఫికెట్ చెల్లుబాటు గడువును కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం బీఎస్-6 వ్యక్తిగత వాహనాలకు మొదటి ఆరేళ్లలో మూడేళ్లకోసారి మాత్రమే సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు ఆరేళ్లలో రెండుసార్లు మాత్రమే పీయూసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులతో వాహనదారులకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.
Details
వాహనం వయసును బట్టి రెన్యువల్ గడువు
అయితే ఈ వెసులుబాటు వాహనం జీవితకాలం మొత్తం కొనసాగదు. దాని వయసును బట్టి పీయూసీ రెన్యువల్ గడువు మారుతుంది.
ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న బీఎస్-6 వ్యక్తిగత వాహనాలకు ఏడాదికోసారి సర్టిఫికెట్ తీసుకోవాలి. పదేళ్లు దాటిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి.
అంటే వాహనం పాతబడుతున్న కొద్దీ కాలుష్య నియంత్రణ పరీక్షలపై పర్యవేక్షణ పెరుగుతుంది. బీఎస్-6 రవాణా వాహనాలకు కూడా ప్రత్యేక గడువులు నిర్ణయించారు.
మొదటి ఆరేళ్ల వరకు రెండేళ్లకోసారి, ఆ తర్వాత పదేళ్ల వరకు ఏటా, పదేళ్లు దాటితే ఆరు నెలలకోసారి పీయూసీ అవసరం.
Details
పాత వాహనాలకు మరింత తరచుగా పరీక్షలు
బీఎస్-4 వాహనాలకు పీయూసీ రెన్యువల్ గడువును ఆరు నెలలకు పరిమితం చేశారు.
బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 వాహనాలకు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో బీఎస్-1 నుంచి బీఎస్-4 వరకు వ్యక్తిగత వాహనాలకు ఆరు నెలల గడువు ఉండేది.
ఇప్పుడు వాహనం ఉద్గార ప్రమాణాలు, వయసును బట్టి నిబంధనలు మారాయి.
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-2026లో చేసిన ఈ మార్పుల ఉద్దేశం కాలుష్య నియంత్రణను మరింత సమర్థంగా పర్యవేక్షించడంతో పాటు కొత్త వాహనదారులకు అవసరమైన వెసులుబాటు కల్పించడం.