Loading...
Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు కొత్త రూల్స్.. ఇక 30 రోజులే గడువు
తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు కొత్త రూల్స్.. ఇక 30 రోజులే గడువు

Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు కొత్త రూల్స్.. ఇక 30 రోజులే గడువు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్త వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు పొందాలనుకునే వారికి రవాణా శాఖ కీలక సూచన చేసింది. నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ కోసం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)తో నెలల తరబడి వాహనాలను నడుపుతూ శాశ్వత రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేస్తున్న విధానానికి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న రెండు నెలల గడువును 30 రోజులకు కుదించింది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

వివరాలు 

గడువు ముగిసిన వెంటనే.. సాధారణ ర్యాండమ్ నంబర్

కొత్త నిబంధనల ప్రకారం.. వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఫ్యాన్సీ నంబర్ రిజర్వేషన్, ఆన్‌లైన్ బిడ్డింగ్, సంబంధిత ఫీజుల చెల్లింపు వంటి అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలి.

నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ కోసం పొందిన అవకాశాన్ని కోల్పోతారు.

గడువు ముగిసిన వెంటనే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా సాధారణ ర్యాండమ్ నంబర్‌ను కేటాయిస్తుంది.

ఆ తర్వాత కేటాయించిన నంబర్‌ను ఫ్యాన్సీ నంబర్‌తో మార్చుకునేందుకు ఎలాంటి అవకాశం ఉండదు.

ఈ కొత్త నిబంధనల గురించి వాహనం కొనుగోలు చేసే సమయంలోనే కస్టమర్లకు స్పష్టంగా వివరించాలని షోరూమ్ డీలర్లకు రవాణా శాఖ సూచించింది.

వివరాలు 

60రోజుల నుంచి 30రోజులకు తగ్గించిన రవాణా కమిషనర్ కార్యాలయం

గతంలో ఫ్యాన్సీ నంబర్ ఎంపిక కోసం 60రోజుల గడువు ఉండేది. దీంతో చాలామంది వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్లతోనే రెండు నెలల పాటు రోడ్లపై తిరిగేవారు.

ఈ విధానం వల్ల నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణతో పాటు నేరాల నియంత్రణ,భద్రత పరంగా సమస్యలు ఎదురవుతున్నాయి.

అంతేకాకుండా కొత్త వాహనాలకు తదుపరి రిజిస్ట్రేషన్ సిరీస్ నంబర్ల కేటాయింపు ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది.

ఈ సమస్యలకు పరిష్కారంగా గడువును 60రోజుల నుంచి 30రోజులకు తగ్గించినట్లు రవాణా కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.

కొత్త నిబంధనలతో వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపు వేగవంతమవుతుందని తెలిపింది.

అలాగే ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా సకాలంలో సమకూరుతుందని పేర్కొంది.

ADVERTISEMENT