BYD Denza D9 vs Toyota Vellfire: BYD డెంజా D9 వర్సెస్ టయోటా వెల్‌ఫైర్...ఏది బెస్ట్ ఛాయిస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత లగ్జరీ కార్ల మార్కెట్లో ఇప్పుడు కొత్త పోటీ మొదలైంది. ఇప్పటివరకు ఈ విభాగంలో టయోటా వెల్‌ఫైర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. నవంబర్ 13న విడుదలైన BYD డెంజా D9 దానికి గట్టి పోటీ ఇస్తోంది. డెంజా D9 ప్రారంభ ధర రూ.90 లక్షలు కాగా, టయోటా వెల్‌ఫైర్ ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు ఉంది. అంటే ఈ రెండు కార్ల మధ్య దాదాపు రూ.30 లక్షల వ్యత్యాసం ఉంది. రెండూ ఏడు సీట్లతో 2+2+3 లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Details
పవర్, రేంజ్‌లో డెంజా D9 ముందంజ
BYD డెంజా D9లో 115.07kWh బ్యాటరీ, 462hp శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే NEDC ప్రకారం 730 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 8.5 సెకన్లలో అందుకుంటుంది.
మరోవైపు టయోటా వెల్‌ఫైర్‌లో 2.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 193hp పవర్, 240Nm టార్క్ అందిస్తుంది. దీని ప్రకటిత మైలేజీ 19.28 కిలోమీటర్లు.
Details
క్యాబిన్ సౌకర్యాల్లో ఎవరిది పైచేయి?
డెంజా D9 పొడవు 5,250mm కాగా, వెల్‌ఫైర్ 5,005mm పొడవు ఉంటుంది. డెంజాలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 16 స్పీకర్ల Devialet ఆడియో సిస్టమ్, మూడు జోన్ల ఏసీ, ఫ్రంట్ సీట్ మసాజర్, ఇన్-కార్ ఫ్రిజ్ ఉన్నాయి.
వెల్‌ఫైర్‌లో 14 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 15 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వెనుక ప్రయాణికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ లభిస్తాయి.
Details
భద్రత, ధర.. ఏది మంచి ఎంపిక?
రెండు కార్లలోనూ లెవల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.
అయితే డెంజాలో 9 ఎయిర్‌బ్యాగ్స్ ఉండగా, వెల్‌ఫైర్‌లో 6 ఉన్నాయి. ఎక్కువ పవర్, అధిక రేంజ్, ఆధునిక ఫీచర్లు, తక్కువ ధర కోరుకునేవారికి డెంజా D9 ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడకుండా ప్రయాణించాలనుకునేవారికి వెల్‌ఫైర్ హైబ్రిడ్ విధానం ఉపయోగకరం.
అంతేకాదు, టయోటాకు ఉన్న విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ కూడా కొనుగోలుదారులకు అదనపు భరోసా ఇస్తుంది.