Loading...
Ethanol blending India: పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్‌.. కేంద్రం కొత్త ప్లాన్
పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్‌.. కేంద్రం కొత్త ప్లాన్

Ethanol blending India: పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్‌.. కేంద్రం కొత్త ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ20 (E20) కంటే ఎక్కువ శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఈ అధిక ఇథనాల్‌ మిశ్రమ ఇంధనాన్ని వినియోగించేందుకు ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలు (Flex-Fuel Vehicles) అవసరం కానున్నాయి. అధిక శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను వినియోగించే సామర్థ్యం ఈ వాహనాలకు ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారు తరుణ్‌ కపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఈ20 స్థాయి కంటే ఎక్కువగా ఇథనాల్‌ను కలిపేందుకు అనుమతించే అంశంపై ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

వివరాలు

ఫ్లెక్సీ-ఫ్యూయల్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలి

ఇందుకు ఫ్లెక్సీ-ఫ్యూయల్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు.

ఇప్పటివరకు ఈ20 కార్యక్రమం విజయవంతంగా సాగిందని, పలు ఆటోమొబైల్‌ కంపెనీలు త్వరలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించాయని పేర్కొన్నారు.

''ఈ20 చాలా విజయవంతమైంది. ఇప్పుడు మా దృష్టి ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలపై ఉంది.

ఈ20 కంటే ఎక్కువ శాతం ఇథనాల్‌ కలిపేలా అనుమతించే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఇందుకు ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలే అవసరం'' అని తరుణ్‌ కపూర్‌ పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది.

వివరాలు

ఏప్రిల్‌ 2026 నుంచే దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్

కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌ను ప్రామాణిక ఇంధనంగా అమలు చేసింది.

వాస్తవానికి ఈ20 కార్యక్రమానికి నిర్దేశించిన గడువు కంటే ముందుగానే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ఈ20 అంటే 80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఇథనాల్‌ కలిసిన ఇంధనం. ప్రీమియం కేటగిరీకి చెందిన 95 ఆక్టేన్‌ పెట్రోల్‌ కూడా ప్రస్తుతం 20 శాతం ఇథనాల్‌ కలిగినదిగానే విక్రయిస్తున్నారు.

అయితే దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌ తప్పనిసరి అయినప్పటి నుంచి పాత వాహనాలపై దాని ప్రభావం గురించి చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యం గణనీయంగా తగ్గుతోందని, కీలక వాహన భాగాల్లో అరుగుదల, దెబ్బతినే సమస్యలు పెరుగుతున్నాయని పలువురు వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

బయోఫ్యూయల్స్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి

అయితే ఈ20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్‌ కంపెనీలు చెబుతున్నాయి.

భారత్‌కు బయోఫ్యూయల్స్‌, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అత్యంత కీలకమని తరుణ్‌ కపూర్‌ తెలిపారు.

బయోఫ్యూయల్స్‌ను భారీ స్థాయిలో ప్రోత్సహించేలా ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ విషయంలో పరిశ్రమ కూడా ఎంతో సహకరిస్తోందని, దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరిగిందని పేర్కొన్నారు.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బయోఫ్యూయల్స్‌పై దృష్టి మరింత కీలకంగా మారిందని కపూర్‌ వివరించారు.

ఈ సంక్షోభం కారణంగా ముడిచమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడి, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఇథనాల్‌ బ్లెండింగ్‌ స్థాయిని మించిపోయింది

ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం అవసరమైన ఇథనాల్‌ బ్లెండింగ్‌ స్థాయిని మించిపోయిందని కపూర్‌ తెలిపారు.

దీంతో అదనంగా అందుబాటులో ఉన్న ఇథనాల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఇతర మార్గాలను పరిశ్రమ అన్వేషించాల్సి ఉంటుందని చెప్పారు.

వివరాలు

ఈ20పై విమర్శలకు కపూర్‌ సమాధానం

ఇథనాల్‌ వినియోగం విజయవంతమైనప్పటికీ.. ఈ20పై వస్తున్న విమర్శలకు ప్రధానంగా తప్పుడు సమాచారం లేదా ఇతర ఉద్దేశాలే కారణమని తరుణ్‌ కపూర్‌ అన్నారు.

ఈ20పై ఇప్పటికే అనేక అధ్యయనాలు, ప్రయోగాలు జరిగాయని, వాటి ఫలితాల్లో ఈ20 బాగా పనిచేస్తుందని తేలిందని పేర్కొన్నారు.

ఇథనాల్‌ కలపడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. అధిక ఆక్టేన్‌ విలువ కారణంగా అది భర్తీ అవుతుందని కపూర్‌ తెలిపారు.

వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలు సాధారణంగా ఇంధనంలో ఇథనాల్‌ కలపడం వల్ల మాత్రమే రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

పెట్రోల్‌ బంకుల్లోనూ మార్పులు

పలు ఆటో మొబైల్‌ కంపెనీలు త్వరలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలను తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించాయని కపూర్‌ చెప్పారు.

దీంతో రాబోయే రోజుల్లో మార్కెట్లో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ మోడళ్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాల లభ్యత పెరుగుతున్న కొద్దీ పెట్రోల్‌ బంకుల్లో స్వచ్ఛమైన ఇథనాల్‌, సంబంధిత యాడిటివ్స్‌ సరఫరాను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఇంధన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు

డీజిల్‌లోనూ బయోఫ్యూయల్స్‌ కలపడంపై ప్రయోగాలు

పెట్రోల్‌కే పరిమితం కాకుండా డీజిల్‌లోనూ బయోఫ్యూయల్స్‌ కలపడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

బయోఫ్యూయల్‌ ఆధారిత యాడిటివ్స్‌పై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తరుణ్‌ కపూర్‌ తెలిపారు.

ముఖ్యంగా ఐసోబ్యూటనాల్‌పై జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమైతే బయోఫ్యూయల్స్‌కు మరో పెద్ద మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

రిఫైనరీల ఉత్పత్తిలో డీజిల్‌కు గణనీయమైన వాటా ఉండటంతో.. ఈ రంగంలో బయోఫ్యూయల్స్‌ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని కపూర్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT