Loading...
Petrol bike to EV: 4 గంటల్లో పెట్రోల్‌ బైక్‌ ఈవీగా మార్పు.. ఖర్చు కేవలం రూ.40 వేలు!
4 గంటల్లో పెట్రోల్‌ బైక్‌ ఈవీగా మార్పు.. ఖర్చు కేవలం రూ.40 వేలు!

Petrol bike to EV: 4 గంటల్లో పెట్రోల్‌ బైక్‌ ఈవీగా మార్పు.. ఖర్చు కేవలం రూ.40 వేలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఐఐటీ సమిట్‌ వివిధ నూతన, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో ఏర్పాటు చేసిన అంకుర సంస్థల స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆయా సంస్థలు రూపొందిస్తున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ఆయన ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుతం ఆ ప్రక్రియ ఏ దశలో ఉంది? ఎంతమందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి? ఆయా ప్రాజెక్టులను అమలు చేయడంలో మీకు ఎంత అనుభవం ఉంది? వంటి పలు ప్రశ్నలను చంద్రబాబు ఆయా సంస్థల ప్రతినిధులను అడిగారు. వారి ప్రతిపాదనలు, ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

వివరాలు

కర్నూలులో డ్రోన్‌ తయారీ యూనిట్

అంకుర సంస్థలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపుతో పాటు వివిధ అనుమతుల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌కు చంద్రబాబు సూచించారు.

కర్నూలులో డ్రోన్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆక్సి ఏరోస్పేస్‌ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో తమకు డ్రోన్‌ తయారీ యూనిట్‌ ఉందని వివరించారు. కర్నూలులోని వివిధ గ్రామాల్లో 50 మైక్రో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా డ్రోన్లకు అవసరమైన విడిభాగాలను తయారు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు చెప్పారు.

వారు తయారు చేసిన డ్రోన్‌ను చంద్రబాబు పరిశీలించారు.

వివరాలు

స్థలం ఇస్తాం.. యూనిట్‌ ప్రారంభించండి

కంపెనీ ప్రతినిధుల కోరిక మేరకు ఆ డ్రోన్‌పై ఆయన సంతకం చేశారు. పెట్రోల్‌తో నడిచే బైక్‌లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే సాంకేతికతను రూపొందిస్తున్న సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు.

పెట్రోల్‌ బైక్‌లను ఈ-బైక్‌లుగా మార్చే ప్రాజెక్టు గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు.

కాలం చెల్లిన వాహనాలను సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చగలమని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. రూ.40 వేల ఖర్చుతో కేవలం నాలుగు గంటల్లో పెట్రోల్‌ బైక్‌ను ఈవీ వాహనంగా మార్చగలమని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలతో మూడు, నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు.. యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

'ఏం కావాలో చెప్పండి.. అన్నీ ఏర్పాటు చేస్తాం'

ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను తయారు చేసే ఆటోనెక్ట్‌ సంస్థ కుప్పంలో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు.

రక్షణ అవసరాలకు ఉపయోగించే డ్రోన్‌లను తయారు చేసే ఫాల్కన్‌ స్కై వర్క్స్‌ సంస్థ ప్రతినిధులు కూడా రాష్ట్రంలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సీఎంకు తెలిపారు.

దీనిని చంద్రబాబు స్వాగతించారు. 'మీకు ఏం కావాలో చెప్పండి. అన్నీ ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

శాటిలైట్‌ సమాచారంతో సిటీ మ్యాపింగ్‌పై ఆసక్తి

శాటిలైట్‌ సమాచారం ఆధారంగా నగరాల మ్యాపింగ్‌ చేసే విధానం గురించి చంద్రబాబు ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని ఏదో ఒక పట్టణాన్ని ఈవిధానంలో మ్యాపింగ్‌ చేసి తన వద్దకు రావాలని సంబంధిత సంస్థ ప్రతినిధులకు సూచించారు.

అలాగే ఏఐ ఫేస్‌ స్కాన్‌ ద్వారా కేవలం 30సెకన్లలోనే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య నివేదికను అందించే యాప్‌ గురించి కూడా చంద్రబాబు ఆరా తీశారు.

ఈ యాప్‌ ద్వారా హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, బీపీ, స్ట్రెస్‌ ఇండెక్స్‌ తదితర వివరాలను తెలుసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వివరించారు.

చంద్రబాబు స్వయంగా ఆ యాప్‌ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకున్నారు. ఆయన బీపీ, హృదయ స్పందన రేటు నార్మల్‌గా వచ్చినట్లు తెలిపారు.

ADVERTISEMENT