Page Loader
Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌! 
ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌!

Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు అనుసరించే ధరల విధానంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీ, గ్రాసరీ వంటి యాప్‌లు ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఇంతకుముందు నుంచే వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాత్రమే కాదు, ఫోన్ ఖరీదును బట్టి కూడా వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. ఫోన్ బ్యాటరీ శాతం తక్కువగా ఉన్నప్పుడు క్యాబ్ సంస్థలు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న విషయం ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. ఈ ఘటన నెట్టింట కొత్త చర్చకు దారితీసింది.

వివరాలు 

ఫోన్ మోడల్‌తో పాటు, బ్యాటరీ శాతాన్ని బట్టి కూడా ఛార్జీల్లో మార్పులు

ఇంజినీరింగ్ హబ్ అనే టెక్నాలజీ ప్లేస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను నడుపుతున్న ఢిల్లీకి చెందిన రిషభ్ సింగ్ ఎక్స్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు ఫోన్ మోడల్‌తో పాటు, బ్యాటరీ శాతాన్ని బట్టి కూడా ఛార్జీల్లో మార్పులు చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ ఫోన్లను ఉపయోగించి ఈ అంశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అన్ని ఫోన్లలో ఒకే అకౌంట్‌తో లాగిన్ చేసి, ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పుడు ఛార్జీల్లో తేడా ఉండటం గమనించారని చెప్పారు.

వివరాలు 

తక్కువ బ్యాటరీ శాతం ఉన్న ఫోన్‌లో ఎక్కువ ఛార్జీలు 

సింగ్ ప్రకారం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ఆధారంగా 13% నుండి 50% వరకు డిస్కౌంట్లు చూపించారని తెలిపారు. ముఖ్యంగా, తక్కువ బ్యాటరీ శాతం ఉన్న ఫోన్‌లో ఎక్కువ ఛార్జీలను చూపించారని పేర్కొన్నారు. యూజర్ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తోందని ఆరోపించారు. ఉబర్ ప్రైసింగ్ విధానంలో పారదర్శకత ఉండాల్సిన అవసరాన్ని సింగ్ హైలైట్ చేశారు. ఇతర క్యాబ్ సంస్థలు కూడా యూజర్ల విశ్వాసాన్ని కాపాడే విధంగా సరైన ధర విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

వివరాలు 

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి

ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. క్యాబ్ సంస్థలు ఇలాంటి విధానాలు అనుసరించడం సరైనదేనా అని కొందరు యూజర్లు ప్రశ్నించారు. తనకూ ఇలాంటి అనుమానం ఉందని, సింగ్ చేసిన అధ్యయనం దానిని రుజువు చేసిందని ఒక యూజర్ పేర్కొన్నారు. తక్కువ ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం మంచిదని మరొకరు అభిప్రాయపడ్డారు. కేవలం క్యాబ్ సంస్థలే కాదు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయంటూ మరొక యూజర్ ఆరోపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిషబ్ సింగ్ చేసిన ట్వీట్