Ducati Desmo250 MX: డుకాటి డెస్మో250 ఎంఎక్స్ ఆవిష్కరణ.. కొత్త మోటోక్రాస్ బైక్‌లో 5 ప్రత్యేకతలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటాలియన్ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి తన మోటోక్రాస్ శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త డెస్మో250 ఎంఎక్స్ (Desmo250 MX) బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. గతేడాది డెస్మో450 ఎంఎక్స్‌ను పరిచయం చేసిన సంస్థ, ఇప్పుడు ఎంఎక్స్2 విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తేలికైన, శక్తివంతమైన బైక్‌ను తీసుకొచ్చింది. కొత్త ఇంజిన్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, రేసింగ్‌కు అనువైన హార్డ్‌వేర్‌తో ఈ బైక్ ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన మోటోక్రాస్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. డుకాటి డెస్మో250 ఎంఎక్స్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన 249సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 12,500 ఆర్‌పీఎం వద్ద 44.5 హార్స్‌పవర్, 8,800 ఆర్‌పీఎం వద్ద 28.3ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
ఎంఎక్స్2 రేసింగ్ కోసం ప్రత్యేక డిజైన్
డుకాటి ప్రత్యేకమైన డెస్మోడ్రోమిక్ వాల్వ్ టెక్నాలజీతో ఈ ఇంజిన్ 15,000 ఆర్‌పీఎం వరకు పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అప్‌షిఫ్ట్ క్విక్ షిఫ్టర్‌ను కూడా అందించారు. డిజైన్ పరంగా చూస్తే డెస్మో450 ఎంఎక్స్ తరహా స్టైలింగ్‌ను ఈ బైక్‌లో కొనసాగించారు. తక్కువ బరువుతో రూపొందించిన బాడీ, పదునైన డిజైన్, కాంపాక్ట్ ఫ్యూయల్ ట్యాంక్, సన్నని సైడ్ ప్యానెల్స్, రైడర్‌కు పూర్తి నియంత్రణ అందించే ఎర్గోనామిక్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎంఎక్స్2 రేసింగ్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు దీని డిజైన్‌ను బట్టి అర్థమవుతోంది.
వివరాలు
బైక్ డ్రై వెయిట్ కేవలం 103 కిలోలే..
హార్డ్‌వేర్ విషయానికి వస్తే అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్‌తో పాటు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్‌ను అమర్చారు. పూర్తిగా అడ్జస్టబుల్ షోవా ఫ్రంట్ ఫోర్క్స్,రియర్ మోనోషాక్ సస్పెన్షన్ వ్యవస్థను 250 సీసీ మోడల్‌కు అనుగుణంగా ట్యూన్ చేశారు. బ్రేకింగ్ కోసం ముందు 260 మిల్లీమీటర్ల,వెనుక 240 మిల్లీమీటర్ల గాల్ఫర్ డిస్క్‌లతో కూడిన బ్రెంబో బ్రేక్ కాలిపర్స్‌ను అమర్చారు. పైరెల్లి స్కార్పియన్ ఎంఎక్స్32 టైర్లతో వచ్చే ఈ బైక్ డ్రై వెయిట్ కేవలం 103 కిలోలే. ఎలక్ట్రానిక్ ఫీచర్ల పరంగా కూడా డుకాటి డెస్మో250 ఎంఎక్స్ ఆకట్టుకుంటోంది. ఇందులో రెండు ఇంజిన్ మ్యాప్స్, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్,మూడు స్థాయిల లాంచ్ కంట్రోల్,రెండు స్థాయిల ఇంజిన్ బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం ఉన్నాయి.
వివరాలు
ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్
డుకాటి పేటెంట్ పొందిన ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ వెనుక చక్రం స్లిప్‌ను గుర్తించి అవసరమైన మేరకు జోక్యం చేసుకుంటుంది. డుకాటి ఎక్స్-లింక్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రైడర్లు తమకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈ బైక్‌లో మరో ప్రత్యేక ఫీచర్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్. రైడింగ్ పరిస్థితులను విశ్లేషించి ఇంజిన్‌పై పడిన ఒత్తిడిని అంచనా వేసే ప్రత్యేక అల్గారిథమ్ ఆధారంగా సర్వీస్ సమయాలను సూచిస్తుంది. 45 గంటల రైడింగ్ తర్వాత వాల్వ్ క్లియరెన్స్ తనిఖీ అవసరమవుతుండగా, ప్రధాన ఇంజిన్ మెయింటెనెన్స్ వినియోగాన్ని బట్టి మారుతుంది. దీంతో అవసరం లేని సర్వీసింగ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
వివరాలు
2026 జూలై నుంచి ఎంపిక చేసిన యూరప్ దేశాల్లో విక్రయాలు
డుకాటి డెస్మో250 ఎంఎక్స్ 2026 జూలై నుంచి ఎంపిక చేసిన యూరప్ దేశాల్లో విక్రయాలు ప్రారంభం కానుంది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఆగస్టు నుంచి డెలివరీలు ఇవ్వనున్నారు. భారత్‌లో ఈ బైక్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై డుకాటి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రీమియం మోటార్‌సైకిల్ ప్రియులు ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు.