Ducati Panigale V4 Lamborghini: ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన డుకాటి పానిగాలే V4 లంబోర్గిని.. ఇండియాలో తొలి యూనిట్ డెలివరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి విడుదల చేసిన అత్యంత ప్రీమియం బైక్ 'డుకాటి పానిగాలే V4 లంబోర్గిని' భారత్‌లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ హైఎండ్ సూపర్‌బైక్ ధర రూ.1 కోటి (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఇప్పటికే ముంబైలో తొలి యూనిట్‌ను ఓ కస్టమర్‌కు డెలివరీ చేశారు. అయితే ఈ బైక్‌ను కొనాలనుకునే వారికి నిరాశే మిగిలింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. భారత్‌కు కేటాయించిన యూనిట్లు కూడా పూర్తిగా బుక్ అయ్యాయి.
వివరాలు
1,103cc డెస్మోసెడిచి స్ట్రడేలే V4 ఇంజిన్
డుకాటి, లంబోర్గిని భాగస్వామ్యంలో రూపొందిన మూడో బైక్ ఇదే. గతంలో స్ట్రీట్‌ఫైటర్ V4 లంబోర్గిని, డయావెల్ 1260 లంబోర్గిని మోడళ్లు వచ్చాయి. తాజా పానిగాలే V4 లంబోర్గిని డిజైన్‌కు లంబోర్గిని రేవుల్టో సూపర్‌కార్ నుంచి ప్రేరణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 630 నంబర్డ్ యూనిట్లను మాత్రమే తయారు చేశారు. అదనంగా లంబోర్గిని కార్ల యజమానుల కోసం ప్రత్యేకంగా 63 'స్పెషియాలే క్లయింటీ' యూనిట్లను కేటాయించారు. ఈ సూపర్‌బైక్‌లో 1,103cc డెస్మోసెడిచి స్ట్రడేలే V4 ఇంజిన్‌ను అందించారు. ఇది 13,500 rpm వద్ద సుమారు 216-218 bhp పవర్, 11,250 rpm వద్ద 122.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
డుకాటి పానిగాలే V4 లంబోర్గినిలో కార్బన్ ఫైబర్
అక్రపోవిక్ టైటానియం సైలెన్సర్, ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ వల్ల ఈ భారీ పనితీరు సాధ్యమైంది. బైక్ డ్రై వెయిట్ కేవలం 185 కిలోలే ఉండటంతో పవర్-టు-వెయిట్ రేషియో కూడా ఆకట్టుకుంటోంది. డుకాటి పానిగాలే V4 లంబోర్గినిలో కార్బన్ ఫైబర్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ఫెయిరింగ్, మడ్‌గార్డ్స్, చైన్ గార్డ్, హీల్ గార్డ్ వంటి భాగాలు కార్బన్ ఫైబర్‌తో తయారయ్యాయి. లంబోర్గిని రేవుల్టో కార్ వీల్స్ తరహాలో ప్రత్యేక అల్యూమినియం వీల్స్‌ను అందించారు. టెయిల్ సెక్షన్, వింగ్‌లెట్స్, సీటును కూడా లంబోర్గిని డిజైన్ టీమ్‌తో కలిసి ప్రత్యేకంగా రూపొందించారు. భారత మార్కెట్‌లో ఈ బైక్ Verde Scandal, Grigio Telesto, Grigio Acheso Tricolore రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.