Ferrari Amalfi Spider: భారత్‌లో ఫెరారీ అమాల్ఫి స్పైడర్ లాంచ్.. ప్రారంభ ధర రూ.4.6 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్త అమాల్ఫి స్పైడర్ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.6 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఆవిష్కరించిన అమాల్ఫి కూపేకు సాఫ్ట్‌టాప్ వెర్షన్‌గా వచ్చిన ఈ మోడల్‌కు ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అత్యాధునిక ఫీచర్లు, వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా కస్టమైజేషన్ ఎంపికలు ఉండటంతో ఈ కారు లగ్జరీ కార్ల అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అమాల్ఫి స్పైడర్ ధర, అదే సిరీస్‌లోని కూపే మోడల్ కంటే రూ.52 లక్షలు ఎక్కువ. అమాల్ఫి కూపే ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.08 కోట్లు కాగా, స్పైడర్ వెర్షన్‌ను రూ.4.6 కోట్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివరాలు
ఫీచర్ల వివరాలు ఇవే..
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు ప్రయాణికుడి కోసం 8.8 అంగుళాల డిస్‌ప్లే, డ్రైవర్‌కు 15.6 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
అలాగే పవర్డ్ స్పోర్ట్స్ సీట్లు, ఫిజికల్ కంట్రోల్స్‌తో కూడిన మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
ఇంజిన్ విషయానికి వస్తే.. అమాల్ఫి కూపేలో ఉపయోగించిన అదే 3.9 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను ఈ స్పైడర్‌లో కూడా అమర్చారు.
ఈ ఇంజిన్ గరిష్ఠంగా 640 హెచ్‌పీ పవర్, 760 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం..
పనితీరు పరంగా చూస్తే.. ఈ కారు కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
దీని గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్లు. అంతేకాకుండా అప్హోల్స్టరీ, ఇంటీరియర్ ట్రిమ్ భాగాలు, కలర్ స్కీమ్స్‌ను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఫెరారీ కల్పించింది.