Ferrari Luce EV: ఫెరారీ నుంచి తొలి 'Luce' ఎలక్ట్రిక్ కార్.. 1035 హెచ్‌పీ పవర్,530 కి.మీ రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Ferrari తన తొలి రెగ్యులర్ ఎలక్ట్రిక్ కార్ 'Luce EV'ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. సంప్రదాయ సూపర్‌కార్ డిజైన్‌కు పూర్తి భిన్నంగా రూపొందించిన ఈ కారు ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 1035 హెచ్‌పీ పవర్, సుమారు 530 కిలోమీటర్ల రేంజ్‌తో ఈ ఎలక్ట్రిక్ ఫెరారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫెరారీ Centro Stile డిజైన్ టీమ్‌తో పాటు ప్రముఖ డిజైనర్ జోనీ ఐవ్ స్థాపించిన LoveFrom సంస్థ కలిసి ఈ కారును రూపొందించాయి. సాధారణ ఫెరారీ కార్లలా కాకుండా, గాలి నిరోధాన్ని తగ్గించేలా టియర్‌డ్రాప్ ఆకారంలో ఈ కార్ బాడీని తయారు చేశారు.
వివరాలు
ముందు 23 అంగుళాలు, వెనుక 24 అంగుళాల భారీ వీల్స్
అల్యూమినియం బాడీ, ప్రత్యేక వింగ్ స్టైల్ ఫ్రంట్ డిజైన్, హుడ్-విండ్షీల్డ్ కలిసిపోయే స్ట్రక్చర్ ఈ కారుకు ఫ్యూచరిస్టిక్ లుక్ తీసుకొచ్చాయి. 5019 మి.మీ పొడవుతో వచ్చిన Luce EV, Purosangue కంటే మరింత లోతుగా ఉంటుంది. యాక్టివ్ ఏరోడైనమిక్స్ లేకుండానే 0.254 Cd డ్రాగ్ కోఎఫిషియంట్ సాధించడం దీని ప్రత్యేకత. ముందు 23 అంగుళాలు, వెనుక 24 అంగుళాల భారీ వీల్స్‌తో ఈ కార్ రోడ్డుపై చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
వివరాలు
ప్రీమియం క్యాబిన్
కార్ ఇంటీరియర్‌లో మినిమలిజం, లగ్జరీ రెండింటినీ సమతుల్యం చేశారు. అల్యూమినియం, గ్లాస్ మెటీరియల్స్‌తో ప్రీమియం ఫినిష్ ఇచ్చారు. టెక్నాలజీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్లతో క్యాబిన్‌ను నింపలేదు. మధ్యలో ఉన్న డిస్‌ప్లేను ప్రయాణికుడి వైపు తిప్పుకునే సౌకర్యం కల్పించారు. ట్రాన్స్‌మిషన్ టన్నెల్ లేకపోవడంతో ఈ కారులో ఐదు మంది సౌకర్యంగా కూర్చోవచ్చు. వెనుక సీట్లలో ఎక్కువ లెగ్‌రూమ్‌తో పాటు, ఫెరారీలో ఇప్పటివరకు లేనంత పెద్ద లగేజ్ స్పేస్‌ను కూడా అందించారు. ప్రతి భాగంలో ప్రీమియం ఫినిష్, టచ్ ఫీల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది.
వివరాలు
ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్
Ferrari Luce EVలో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ప్రతి వీల్‌కు ఒక్కో మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్లన్నీ ఫెరారీ సంస్థే స్వయంగా అభివృద్ధి చేసింది. ఫార్ములా-1,ఎండ్యూరెన్స్ రేసింగ్ అనుభవాన్ని ఈ టెక్నాలజీలో ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. వెనుక భాగంలోని రెండు మోటార్లు ఒక్కోటి 355 కిలోవాట్లు, ముందు మోటార్లు ఒక్కోటి 105 కిలోవాట్ల పవర్ ఉత్పత్తి చేస్తాయి. మొత్తం కలిపి 1035 హెచ్‌పీ వరకు పవర్ అందుతుంది. ముందు మోటార్లు 30,000 rpm వరకు తిరగగలవని సమాచారం. 800 వోల్ట్ బ్యాటరీ ప్యాక్‌ను చాసిస్‌లో భాగంగానే అమర్చారు. దీని వల్ల కార్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ తగ్గి, డ్రైవింగ్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది.
వివరాలు
కొత్త డ్రైవింగ్ డైనమిక్స్
350 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, పవర్‌ట్రెయిన్‌పై 8 ఏళ్ల అన్‌లిమిటెడ్ మైలేజ్ వారంటీ కూడా అందిస్తున్నారు. సాంప్రదాయ గేర్ షిఫ్ట్‌లకు బదులుగా, స్టీరింగ్‌పై ఉన్న ప్యాడిల్స్ ద్వారా పవర్ డెలివరీ, రీజనరేటివ్ బ్రేకింగ్‌ను నియంత్రించే కొత్త 'Torque Shift Engagement' సిస్టమ్‌ను ఫెరారీ అందించింది. డ్రైవర్ అవసరానికి అనుగుణంగా పవర్, బ్రేకింగ్ తీవ్రతను ఐదు స్థాయిల్లో మార్చుకోవచ్చు. టార్క్ వెక్టరింగ్, రియర్ వీల్ స్టీరింగ్ టెక్నాలజీలతో కలిపి ఈ సిస్టమ్ మరింత స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
వివరాలు
సౌండ్, రేంజ్, ధర
ఎలక్ట్రిక్ కార్లలో ఇంజిన్ సౌండ్ లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని, మోటార్ వైబ్రేషన్స్ ఆధారంగా ప్రత్యేక సౌండ్ సిస్టమ్‌ను ఫెరారీ రూపొందించింది. అవసరమైతే ఈ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌తో సుమారు 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ Ferrari Luce EV ప్రారంభ ధర 5.5 లక్షల యూరోలు (దాదాపు రూ.6.10 కోట్లు)గా నిర్ణయించారు. కస్టమైజేషన్ ఆప్షన్లపై ఆధారపడి తుది ధర మరింత పెరిగే అవకాశం ఉంది.