Hapida Sky: డ్రోన్ టెక్నాలజీతో ఫ్లయింగ్ వెహికల్.. ఉత్తరాఖండ్‌లో యువకుడు సరికొత్త ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా కఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తామ్టా కొత్త ప్రయోగం చేశారు. ఆయనకు చెందిన స్టార్టప్ 'హపిడా స్కై (Hapida Sky)' ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించారు. హపిడా స్కైనెక్స్ (HAPIDA SKYNeX) పేరుతో రూపొందిస్తున్న ఈ వాహనం.. డ్రోన్ టెక్నాలజీని మార్పులు చేసి అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ వాహనం తొలి ప్రయోగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ వీడియోను 'ఎక్స్'లో షేర్ చేశారు.
వివరాలు
కొండ ప్రాంతాల కనెక్టివిటీ కోసం..
పర్వత ప్రాంతాల్లో రవాణా సమస్యలకు పరిష్కారం చూపించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు స్థానిక కథనాల ప్రకారం రవి తామ్టా తెలిపారు.
తన గ్రామం నుంచి ఇంటికి వెళ్లేందుకు దాదాపు 40 కిలోమీటర్ల రహదారి ప్రయాణం చేయాల్సి ఉంటుందని, దీనికి సుమారు 90 నిమిషాల సమయం పడుతుందని చెప్పారు.
అదే దూరాన్ని వ్యక్తిగత ఫ్లయింగ్ వెహికల్ ద్వారా కేవలం 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చన్నది ఆయన ఆలోచన.
కొండ ప్రాంతాల్లో రహదారి ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రజలకు వేగవంతమైన రవాణా సదుపాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఏళ్లుగా ప్రయోగాలు..
అల్మోరాలోని ఓ బహిరంగ ప్రదేశంలో హపిడా స్కైనెక్స్ టెస్ట్ ఫ్లైట్‌ను నిర్వహించారు.
రవి తామ్టా, ఆయన బృందం కలిసి వాహనం తొలి దశ పరీక్షలను చేపట్టారు. ఇప్పటికే ఉన్న డ్రోన్ టెక్నాలజీకి మార్పులు చేసి.. ఒక వ్యక్తిని మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన వాహనంగా అభివృద్ధి చేసేందుకు తాను ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నట్లు తామ్టా తెలిపారు.
మరోవైపు ఈ ఫ్లయింగ్ వెహికల్ చైనా నుంచి దిగుమతి చేసుకున్నదనే ఆరోపణలను ఆయన ఖండించారు.
తన తయారీ యూనిట్‌ను సందర్శించి వాహనం అభివృద్ధి ప్రక్రియను పరిశీలించవచ్చని ఓ విలేకరికి ఆయన చెప్పినట్లు సమాచారం.
వివరాలు
పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం
హపిడా స్కైనెక్స్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీని బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జ్‌తో ఎంతసేపు ప్రయాణించగలదు, గరిష్ఠ వేగం, ప్రయాణికుడితో పాటు మోయగల బరువు, ఛార్జింగ్‌కు పట్టే సమయం వంటి కీలక సాంకేతిక వివరాలను ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.
ఈ ప్రోటోటైప్‌లో డ్రోన్ టెక్నాలజీని పోలిన కాంపాక్ట్ మల్టీ-రోటర్ వ్యవస్థను ఉపయోగించినట్లు అర్థమవుతోంది.
సింగిల్ సీటర్ డిజైన్‌తో రూపొందించడంతో తొలి దశలో వాహనాన్ని గాల్లోకి ఎత్తడం, సమతుల్యతను కాపాడటం, నియంత్రితంగా ప్రయాణించడం వంటి ప్రాథమిక అంశాలపై బృందం దృష్టి పెట్టే అవకాశం ఉంది.
భవిష్యత్తులో మరింత అధునాతన రూపంలో ఈ ఫ్లయింగ్ వెహికల్‌ను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.